ఘరానా మోసగాడు అరెస్ట్
కడప అర్బన్ : ఆన్‌లైన్‌లో ‘పోలో’,‘వాల్లా’అనే గే యాప్‌లలో సభ్యులను తాను పోలీసునంటూ బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలను దోచుకుంటున్న ఘరానా మోసగాడు చదువుల ప్రసన్నకుమార్ రెడ్డి అలియాస్ ప్రసన్న అలియాస్ కొప్పును కడప చిన్నచౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు ప్రధానంగా కడపలోని ఎం.ఎస్ కొట్టాలకు చెందిన వ్యక్తిని తాను అలిపిరి పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్‌ను అని బెదిరించి దాదాపు రూ.6,95,500 నగదును, రూ. 30 గ్రాముల బంగారు ఆభరణాలను కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కడప చిన్నచౌక్ సీఐ ఏ. ఓబులేసు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి రూ.4.5 లక్షల విలువైన 30 గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ను పోలీసులు రికవరీ చేశారు. నిందితుడు ‘పోలో’, ‘వాల్లా’అనే ఆండ్రాయిడ్ ’గే యాప్’లలో మెంబర్‌గా ప్రవేశించి ఆ యాప్‌లలో నమోదైన మిగిలిన సభ్యుల మొబైల్ నంబర్లు సేకరించుకొని వారికి పోలీసును అంటూ బెదిరింపు కాల్ చేస్తాడు. సభ్యులు యాప్‌లో నేరపూరిత మెసేజ్‌లు పెట్టారు, తమ పైన పోలీస్ కేసు నమోదు చేశామని చెప్పి, తనకు డబ్బులు ఇస్తే కేసులు లేకుండా చేస్తాను అని నమ్మిస్తాడు. చాలామంది అమాయకుల నుంచి డబ్బులు, బంగారు నగలు వసూలు చేస్తాడు. అదేవిధంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పి కూడా డబ్బులు వసూలు చేస్తూ చాలామందిని మోసం చేశాడు.
ఇతను బీటెక్ వరకు చదువుకున్నాడు. అతనికి ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ తో తిరుపతి, అనంతపురం, బెంగళూరు పట్టణాలను కేంద్రాలుగా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై చిన్నచౌక్, కడప వన్ టౌన్, అనంతపురం, నార్పల పోలీస్ స్టేషన్‌లలో సుమారు ఐదు కేసులు వున్నాయి. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చిన్నచౌక్ ఇన్‌స్పెక్టర్ ఎ. ఓబులేసు చిన్నచౌక్ ఎస్‌ఐ రాజరాజేశ్వరరెడ్డి తమ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడిపై ప్రత్యేకమైన నిఘా ఉంచారు. కడప చిన్నచౌక్ పిఎస్ పరిధిలో పాతబైపాస్ సర్కిల్ వద్ద నిందితుడు ప్రసన్నకుమార్ రెడ్డిని అరెస్ట్‌చేసి, అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ను రికవరీచేసినట్లు సీఐ తెలియజేశారు.
రూ.4.5 లక్షల విలువైన
బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ స్వాధీనం


