సీమ ఎత్తిపోతల పథకం కోసం మహోద్యమం
రాయలసీమ గొంతునొక్కుతున్నారు
బాబును ప్రజలు క్షమించరు
కడప కార్పొరేషన్ : రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మహోద్యమం చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాయలసీమకు తీవ్ర అన్యాయమే జరుగుతుందన్నారు. ఆయన రాయలసీమలో పుట్టినా ఈ ప్రాంతానికి ఎలాంటి మేలు చేయలేదన్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రదేశంలో లక్షల ఎకరాల సాగు ఉందని, వీటికి నీరు రావాలంటే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కృష్ణా జలాలు రావాలన్నారు. 1996లో ఆల్మట్టి డ్యామ్ చేపట్టినప్పుడు దాని సామర్థ్యం 17 టీఎంసీలుగా ఉండేదని, దేవెగౌడ ప్రధానమంత్రి అయ్యాక 129.76 టీఎంసీలకు పెంపు చేశారన్నారు. దాని కింద నారాయణపూర్ డ్యామ్ 20 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారన్నారు. ఆల్మట్టి నిర్మించే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి కళ్లు అప్పగించి చూశారే తప్ప.. ఎలాంటి పోరాటం చేయలేదన్నారు. ప్రస్తుతం ఆల్మట్టి ఎత్తును 519 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుతున్నారని, తద్వారా దాని సామర్థ్యం 279.72 టీఎంసీలకు పెరగనుందన్నారు. దీనివల్ల భవిష్యత్‌లో రాయలసీమకు చుక్క నీరు వచ్చే అవకాశం ఉండదన్నారు. కృష్ణానదిపై తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు– రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల వంటి అక్రమ ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు కూడా చంద్రబాబే సీఎంగా ఉన్నారని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని అప్పుడు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు తేవడానికి దివంగత వైఎస్సార్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచే సమయంలో, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాన్ని 88 వేల క్యూసెక్కులకు పెంచాలని చర్యలు చేపట్టినప్పుడు మాత్రం కోర్టుల్లో కేసులు వేసి ఈ ప్రాంతానికి మేలు జరక్కుండా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉందన్నారు. శ్రీశైలానికి వరద నీటి రోజులు పూర్తిగా తగ్గిపోయాయని, 45 రోజుల వరద దినాల్లో వీలైనంత మేర నీటిని తీసుకోవాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దీనికోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి, 80 శాతం పనులు పూర్తి చేసిందన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయాల్సిన సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని రాయలసీమ ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టారన్నారు. ఈ అన్యాయాన్ని నిలదీసేందుకు ఇటీవల పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించామని, మార్చి 1వ తేది రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, చైన్నె ప్రాంత నేతలను కలుపుకొని సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ ప్రణాళికపై చర్చించడం జరుగుతుందన్నారు.
మార్చి 1న 9 జిల్లాల నేతలతో
సన్నాహక సమావేశం
అన్ని పార్టీలు, ప్రజా సంఘాలకు ఆహ్వానం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి
కూటమి ప్రభుత్వం రాయలసీమ గొంతు నొక్కేలా వ్యవహరిస్తోందని బద్వేల్ శాసన సభ్యురాలు డాక్టర్ దాసరి సుధ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాయలసీమ ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. చంద్రబాబు ఈ ప్రాంతానికి ఎటూ మేలు చేయడని, ఎవరైనా చేస్తుంటే కూడా ఓర్వలేరన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో మేయర్ పాకా సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి, ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు, శ్రీరంజన్‌రెడ్డి, పి.సంపత్‌కుమార్, కంచుపాటి బాబు, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. – ఎమ్మెల్యే దాసరి సుధ
రాయలసీమ కడుపుకొడుతున్న సీఎం చంద్రబాబును ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికీ క్షమించారని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. రాయలసీమ కరువుపీడిత ప్రాంతమని, నీటి వనరులు పుష్కలంగా ఉంటేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందన్నారు. శ్రీశైలం డ్యామ్ సామర్థ్యం 215 టీఎంసీలైతే అందులో 10 శాతం పూడిక ఉందని, 854 అడుగుల వరకు నీరు ఉంటేనే రాయలసీమకు నీళ్లు వస్తాయన్నారు. 800 అడుగుల నుంచి 854 అడుగుల వరకూ 90 టీఎంసీలు ఉంటాయని, మిగిలిన నీటిని తెలంగాణ కరెంటు ఉత్పత్తికి వాడుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్‌లో పంటలను కాపాడుకోవాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమన్నారు. ఎన్‌డీఏతో పొత్తులో కొనసాగుతూ కేంద్రంలో ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో మైత్రి కొనసాగించగల మేధావి చంద్రబాబు అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మకై ్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారన్నారు. దీనివల్ల రైతులకు చాలా నష్టం వాటిల్లుతుందని, రైతులు ఇప్పటికై నా మేల్కొని ఉద్యమానికి తరలిరావాలని అన్నారు. – రఘురామిరెడ్డి


