ముగిసిన దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : స్వర్ణాంధ్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ సౌత్ జోన్ దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం జరిగిన లీగ్, ఫైనల్ మ్యాచ్‌లు ముగిశాయి. శనివారం అనంతపురం, కర్నూల్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కర్నూలు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. సాధిక్‌బాషా 62 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టుకు ప్రధాన స్కోరు అందించారు. కర్నూల్ బౌలర్లలో ప్రభాకర్ 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, యానాక్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్నూల్ జట్టు 13 ఓవర్లలో 74 పరుగులకు ఆలౌటైంది. అనంతపురం బౌలర్లలో రోషిరెడ్డి 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసుకొని అద్భుత ప్రదర్శన చేశారు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు రోషిరెడ్డి ఎంపికయ్యారు. అనంతరం నెల్లూరు, అనంతపురం జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హుడా 29 బంతుల్లో 39 పరుగులు, సాధిక్‌బాషా 20 బంతుల్లో 19 పరుగులు చేశారు.
నెల్లూరు బౌలర్లలో అఖిల్ రెడ్డి 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, కిట్టు 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. 142 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి విజేతగా నిలిచి చాంపియన్‌గా అవతరించింది. కిట్టు 38 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. రాకేష్ గౌడ్ 19 బంతుల్లో 23 పరుగులు చేశారు. అనంతపురం బౌలర్లలో సాధిక్ బాషా 3 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశారు. విజేతలకు ఎల్‌ఐసీ డివిజనల్ మేనేజర్ రవి కుమార్, మార్కెటింగ్ ఆఫీసర్ రాకేష్, కడప ఏబీజీ బ్యాంకు మేనేజర్ ఇ. రామమోహన్, భాస్కర్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ మిసెస్ శర్మ, కడప క్రికెట్ అసోసియేషన్ ఏవో నాగేష్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దివ్యాంగుల విభాగ క్రికెట్ కమిటీ సభ్యుడు యడ్లపల్లి సూర్యనారాయణ విన్నర్స్, రన్ర్స్‌కు బహుమతులను అందజేశారు.


