కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో స్థానిక క్రాస్ రోడ్డు సమీపంలోని పెద్దచెప్పలి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ విద్యా సాగర్ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వేంపల్లె మండలం ముతుకూరుకు చెందిన మాచునూరు శ్రీనివాసులు (38), అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులురెడ్డిలు బైక్‌లో కమలాపురం మండలం విభరాపురంలో సొంత పనుల నిమిత్తం వచ్చారు. తిరిగి వెళుతుండగా పెద్దచెప్పలి క్రాస్ వద్దకు రాగానే స్పీడ్ బ్రేకర్ ఉండటంతో బైక్ నడిపే శ్రీనివాసులురెడ్డి స్లో చేశాడు. కడప నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న లారీ బైక్‌ను వేగంగా వెళ్లి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనుక వైపు కూర్చున్న మాచునూరు శ్రీనివాసులు కింద పడ్డాడు. అతడిని తొక్కించుకుంటూ లారీ వెళ్లిపోయింది. ఈ ఘటనలో శ్రీనివాసులు నడుము నుంచి మోకాళ్ల వరకు ఉన్న భాగమంతా నుజ్జు నుజ్జు అయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న శ్రీనివాసులురెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా ప్రమాదానికి కారణమైన లారీని ఎర్రగుంట్ల వద్ద పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది.


