కనీస మద్దతు ధరతో ‘శనగ’ కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

కనీస మద్దతు ధరతో ‘శనగ’ కొనుగోలు చేయాలి

Feb 18 2026 7:16 AM | Updated on Feb 18 2026 7:16 AM

కనీస మద్దతు ధరతో ‘శనగ’ కొనుగోలు చేయాలి

కనీస మద్దతు ధరతో ‘శనగ’ కొనుగోలు చేయాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రకృతి అనుకూలించి ఈ యేడు జిల్లాలో శనగ పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ రైతులకు కష్టాలు తప్పడం లేదని కడప లోక్‌సభ సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. శనగ క్వింటాలు రూ. 5875 కనీస మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయిందని పేర్కొన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరించకపోవడం వల్ల రైతులు రూ. 4700లకే అమ్ముకునే దుస్థితి తలెత్తిందన్నారు. ఇప్పటికే 25 శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఎంఎస్‌పీతో శనగ పంట కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌తో ఈ విషయంపై చర్చించారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రజా సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగులకు నీటిమట్టం చేరితేగానీ రాయలసీమ ప్రాజెక్టులకు 7000 క్యూసెక్కులు మాత్రమే డ్రా చేసుకునే వీలుంటుందన్నారు. గాలేరు–నగరి, తెలుగుగంగ, కేసీ కెనాల్‌, ఎస్‌ఆర్‌బీసీ లాంటి పథకాలకు శ్రీశైలంలో 880 అడుగుల నీటిమట్టం ఉంటేనే నీరు అందుతుందన్నారు. కానీ, తెలంగాణ విచ్చల విడిగా నీటిని తోడేస్తుంటే శ్రీశైలంలో 880 అడుగుల లెవెల్‌ చేరుకోదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కన్నా ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అందుకే ముందుచూపుతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 800 అడుగుల నుంచే నీటిని డ్రా చేసుకోవడానికి వీలుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని పేర్కొన్నారు. రాయలసీమకు రాష్ట్ర బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ బాలయ్య, వైఎస్సార్‌ సీపీ నాయకులు వల్లంబాయి హృషికేశవరెడ్డి, షేక్‌ షఫీవుల్లా, సీహెచ్‌ వినోద్‌కుమార్‌, దేవిరెడ్డి ఆదిత్య, చెన్నూరు ఎంపీపీ చీర్ల సురేష్‌యాదవ్‌, వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, వేణుగోపాల్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న సర్కార్‌

పులివెందుల : కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం పులివెందులలోని తన నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు చంద్రబాబు పీఎం కిసాన్‌కు సంబంధం లేకుండా ఏడాదికి రూ.20వేలు రైతన్నలకు అందిస్తానని ప్రతి ఎన్నికల మీటింగ్‌లలో ఊదరగొట్టారని.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఏ పంటకూ గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. కనీసం రైతులకు యూరియా కూడా అందించలేని అధ్వాన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. 20నెలలుగా అన్ని విధాలుగా నష్టపోయిన రైతాంగానికి ప్రస్తుత బడ్జెట్‌లో ఎంతమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. వ్యవసాయ రంగానికి అరకొరగా కేటాయించడంపై ఈ ప్రభుత్వానికి రైతులపట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్‌ నిర్వహించారు.

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement