చంద్రబాబు పాలనలో అప్పులు, అరాచకం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో అప్పులు, అరాచకం

Feb 22 2026 7:17 AM | Updated on Feb 22 2026 7:17 AM

చంద్రబాబు పాలనలో అప్పులు, అరాచకం

చంద్రబాబు పాలనలో అప్పులు, అరాచకం

జమ్మలమడుగు : ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు, రైతులకు చేసిందేమీ లేదు. 20 నెలల పాలనలో ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఆ అప్పులు దేనికి ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు పరిచారా అంటే అదీ లేదు’ అని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందన్నారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి, ఇబ్బందులకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు పరిచే ఆలోచనలో ప్రభుత్వం కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో మూడు సార్లు కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందన్నారు. మూడో బడ్జెట్‌లో కూడా రైతులు, చేనేతలు, విద్యార్థులకు ఇచ్చిన హామీలైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఆసరా పథకాలకు నిధులు కేటాయించలేదన్నారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. కానీ సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అంటూ కోట్లాది రూపాయల నిధులు ప్రకటనలకు ఖర్చు చేస్తున్నారే తప్ప.. క్షేత్ర స్థాయిలో సూపర్‌ సిక్స్‌ పథకాలు సూపర్‌ఫ్లాప్‌ అయ్యాయన్నారు.

వైఎస్సార్‌సీపీపై అసత్య ప్రచారం

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, శ్రీలంకగా మారిందంటూ పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారంటూ కూటమి నాయకులు అసత్య ప్రచారం చేశారని విమర్శించారు. కానీ చంద్రబాబు పాలనలో గత మూడు సార్లు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ఆదాయం లక్ష కోట్లు అని చూపారని, అందులో వచ్చింది 60 వేల కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు నాయుడు అప్పులు సృష్టించి పెద్దలకు పంచి పెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సింగరయ్య పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement