రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా మారుస్తున్న చంద్రబాబు
పులివెందుల : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నాడని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఆధోగతిపాలు చేసిన విషయం తెలిసిందేనన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన 20నెలల కాలంలోనే రాష్ట్రంపై రూ.3లక్షల కోట్లకు పైగా అప్పుల భారాన్ని మోపారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిలేదన్నారు. ఎన్నికలపుడు ఇచ్చిన ఏ ఒక్క హమీని ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. కమీషన్ల రూపంలో రూ. కోట్లు దండుకోవడమే టీడీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారన్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వంలో వచ్చిన పారిశ్రామిక పెట్టుబడులను ప్రస్తుతం తమ హయాంలో వచ్చినట్లుగా కవరింగ్ చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. తమ అనువయూలకు వేలకోట్ల ప్రభుత్వ భూములను ఎకరం 99పైసలకు కట్టబెడుతున్న నీచ చరిత్ర చంద్రబాబునాయుడుదే అని అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడటంలో రాష్ట్రాన్ని చంద్రబాబు అగ్రగామిగా నిలుపుతున్నాడన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.
రాష్ట్ర బడ్జెట్ అంకెలగారడీ : చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెలగారదీగా ఉందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు.సంక్షేమ పథకాలకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులే లేవన్నారు. 18ఏళ్లు నిండిన ఆడవారికి నెలకు రూ.15వందలు చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తామన్నాని చెప్పి బడ్జెట్‌లో ఆపథకానికి ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పి దానికి కూడా ఒక్కరూపాయి కేటాయించలేదన్నారు. నిరుద్యోగభృతికి కూడా మంగళంపాడారన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ఈబడ్జెట్ లేదని తెలిపారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


