● కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
● ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి
కడప కార్పొరేషన్ : తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వుండాలని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుపాను ప్రభావం ఎక్కువగా వుండే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అధికారులు, సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులను సంబంధిత నోడల్ ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం వున్న ప్రాంతాల్లో సంబంధిత సూపరింటెండింగ్ ఇంజనీర్లు అప్రమత్తంగా వుండాలన్నారు. భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు వీలుగా అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సంస్థ పరిధిలో సర్కిల్స్, డివిజన్స్, సబ్–డివిజన్స్, సెక్షనన్స్ స్థాయిల్లో నోడల్ ఆఫీసర్లను నియమించామని, అదే విధంగా కంట్రోల్ రూమ్స్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీ వర్షం కురుస్తున్న సందర్భాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుందని, ప్రజలు తమ గృహాల్లో చార్జింగ్ లైట్లు, తాగు నీటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు విద్యుత్ స్తంభాలను తాకవద్దని, లైన్ల కింద నిల్చోవద్దని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, లైన్లు తెగిపడడం లాంటి సంఘటనలను గుర్తించినట్లయితే తక్షణమే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులు/సిబ్బందికి గానీ లేదా టోల్ ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. అదే విధంగా సంస్థ వాట్సాప్ నంబరు: 91333 31912కు చాట్ చేయడం ద్వారా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని వివరించారు.


