మార్కెట్లను కుదిపేసిన అమ్మకాల ఒత్తిడి | Sensex Falls, Nifty Slips: Key Reasons Behind Market Decline | Sakshi
Sakshi News home page

మార్కెట్లను కుదిపేసిన అమ్మకాల ఒత్తిడి

Oct 21 2026 4:05 PM | Updated on Oct 21 2026 4:32 PM

Sensex Falls, Nifty Slips: Key Reasons Behind Market Decline

నిఫ్టీ 77 పాయింట్లు డౌన్‌..

సెన్సెక్స్‌ 143 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 50 సూచీ 77 పాయింట్లు తగ్గి 22,811 వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 143 పాయింట్లు క్షీణించి 73,709 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు, విదేశీ పెట్టుబడిదారుల లావాదేవీలు, కార్పొరేట్‌ ఫలితాలపై అంచనాలు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే కీలక అంశాలుగా ఉన్నాయి. అయితే, ఈరోజు పతనానికి ఏ అంశాలు ఎంత మేర కారణమయ్యాయో నిపుణులు అంచనా కింద చూద్దాం.

లాభాల స్వీకరణ

ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు గరిష్ఠ స్థాయిల నుంచి వెనక్కి తగ్గడం లాభాల స్వీకరణ ఒత్తిడిని సూచిస్తోంది. తక్కువ స్థాయిల వద్ద కొనుగోళ్లు చేసిన మదుపరులు ధరలు పెరిగినప్పుడు లాభాలను నగదుగా మార్చుకోవడం మార్కెట్‌ పతనానికి దారితీసి ఉండొచ్చు. ముఖ్యంగా కీలక నిరోధక స్థాయులకు చేరడంతో స్వల్పకాలిక ట్రేడర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతారు.

ముడిచమురు ధరల సెగ

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడిచమురు ధర ఇటీవల బ్యారెల్‌కు 110 డాలర్ల స్థాయిని దాటడం భారత ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడిని పెంచింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, చమురు సరఫరాకు అంతరాయాల భయాలు ధరలను పెంచుతున్నాయి. భారత్‌ అధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశం కావడంతో దిగుమతి బిల్లు పెరగడం, ద్రవ్యోల్బణం మళ్లీ వేడెక్కడం, కంపెనీల నిర్వహణ వ్యయాలు పెరగడం వంటి ప్రమాదాలు ఎదురవుతాయి.

విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు

విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల (ఎఫ్‌పీఐ) నిరంతర విక్రయాలు దేశీయ మార్కెట్లకు ప్రధాన ప్రతికూలాంశంగా మారాయి. అక్టోబర్‌లో ఇప్పటివరకు భారత ఈక్విటీల నుంచి దాదాపు రూ.49,457 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లినట్లు అక్టోబర్‌ 19 నాటి ఎన్‌ఎస్‌డీఎల్‌ గణాంకాలను ఉటంకిస్తూ నివేదికలు వెల్లడించాయి. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌, చమురు ధరలు పెరగడం వంటి పరిణామాలు విదేశీ నిధుల కేటాయింపులపై ప్రభావం చూపుతున్నాయి.

అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌, వడ్డీరేట్ల ఆందోళనలు

అమెరికా ప్రభుత్వ బాండ్లపై రాబడులు పెరిగినప్పుడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం కంటే అమెరికావైపు మదుపరులు మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. దీంతో భారత్‌ వంటి మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గవచ్చు. దేశీయంగా కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల విధానంపై అంచనాలు కీలకంగా మారాయి. అధిక చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని పెంచితే భవిష్యత్తులో వడ్డీరేట్ల తగ్గింపునకు అవకాశాలు పరిమితం కావచ్చనే భయాలు ఈక్విటీ విలువలపై ఒత్తిడి కలిగిస్తాయి.

భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సాంకేతిక నిరోధాలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల భద్రతపై ఆందోళనలు మదుపరుల్లో అప్రమత్తతను పెంచాయి. అదే సమయంలో నిఫ్టీకి 23,100 స్థాయి కీలక నిరోధంగా మారిందని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ స్థాయిని అధిగమించలేకపోవడంతో కొనుగోళ్ల ఉత్సాహం తగ్గి అమ్మకాలు పెరిగే అవకాశం ఏర్పడింది.

ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డేటా లీకేజీపై దర్యాప్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement