మారుతీ 800కు అంతర్జాతీయ గుర్తింపు | Maruti 800 wins FIVA World Vehicle Heritage Award | Sakshi
Sakshi News home page

మారుతీ 800కు అంతర్జాతీయ గుర్తింపు

Nov 17 2026 4:52 AM | Updated on Nov 17 2026 4:52 AM

Maruti 800 wins FIVA World Vehicle Heritage Award

ప్రతిష్టాత్మక ‘ఫివా ప్రపంచ వాహన వారసత్వ’ పురస్కారం  

భారత్‌ నుంచి ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక కారు ఇదే 

ప్రపంచవ్యాప్తంగా 21 చారిత్రక వాహనాల జాబితాలో చోటు  

న్యూఢిల్లీ: భారతీయ ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఎంట్రీ–లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ ‘మారుతీ 800’ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందింది. ప్రతిష్టాత్మక ‘ఫివా ప్రపంచ వాహన వారసత్వ అవార్డు’ అందుకున్న తొలి, ఏకైక భారతీయ కారుగా నిలిచింది. 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మోటారు వాహనాల వారసత్వానికి ఈ కారు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని మారుతీ సుజుకీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘అమెరికా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్లోవేనియా తదితర దేశాల నుంచి ఎంపికైన 21 చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన వాహనాల్లో భారత్‌ నుంచి మారుతీ 800కు చోటు లభించడం విశేషం’’ అని కంపెనీ పేర్కొంది.  

భారత ఇంజినీరింగ్‌ సత్తాకు నిదర్శనం 
‘మారుతీ 800 ప్రస్థానం చాలా చిన్న స్థాయిలో ప్రారంభమైంది. భారత్‌ నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద కార్ల మార్కెట్‌గా ఎదగడంలో, దేశ తయారీ రంగంలో ఆటోమొబైల్‌ విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా నిలవడంలో ఈ కారు కూడా కీలక పాత్ర పోషించింది. నాణ్యమైన ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల తయారీలో దేశీ సామర్థ్యాన్ని ఈ కారు నిరూపించింది. తొలి మారుతీ 800 కారు 1987లో యూరప్‌కు ఎగుమతి అయ్యింది’ అని మారుతీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ గుర్తుచేసుకున్నారు. 

120 దేశాలకు ఎగుమతులు 
‘భారత ప్రభుత్వంతో జాయింట్‌ వెంచర్‌  ద్వారా సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ 1982లో భారత్‌లోకి ప్రవేశించింది. 1983 డిసెంబరులో మారుతీ 800 తొలి కారును తయారు చేసింది. నాటి మా జర్నీలో నేడు మారుతీ  ఏటా 4 లక్షల పైగా కార్లను 120కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది’ అని సుజుకీ ప్రెసిడెంట్‌ తొషిహిరో సుజుకీ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement