breaking news
Motoring Sector
-
మారుతీ 800కు అంతర్జాతీయ గుర్తింపు
న్యూఢిల్లీ: భారతీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఎంట్రీ–లెవల్ హ్యాచ్‌బ్యాక్ ‘మారుతీ 800’ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందింది. ప్రతిష్టాత్మక ‘ఫివా ప్రపంచ వాహన వారసత్వ అవార్డు’ అందుకున్న తొలి, ఏకైక భారతీయ కారుగా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మోటారు వాహనాల వారసత్వానికి ఈ కారు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని మారుతీ సుజుకీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘అమెరికా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్లోవేనియా తదితర దేశాల నుంచి ఎంపికైన 21 చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన వాహనాల్లో భారత్ నుంచి మారుతీ 800కు చోటు లభించడం విశేషం’’ అని కంపెనీ పేర్కొంది. భారత ఇంజినీరింగ్ సత్తాకు నిదర్శనం ‘మారుతీ 800 ప్రస్థానం చాలా చిన్న స్థాయిలో ప్రారంభమైంది. భారత్ నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద కార్ల మార్కెట్‌గా ఎదగడంలో, దేశ తయారీ రంగంలో ఆటోమొబైల్ విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా నిలవడంలో ఈ కారు కూడా కీలక పాత్ర పోషించింది. నాణ్యమైన ఇంజినీరింగ్ ఉత్పత్తుల తయారీలో దేశీ సామర్థ్యాన్ని ఈ కారు నిరూపించింది. తొలి మారుతీ 800 కారు 1987లో యూరప్‌కు ఎగుమతి అయ్యింది’ అని మారుతీ చైర్మన్ ఆర్సీ భార్గవ గుర్తుచేసుకున్నారు. 120 దేశాలకు ఎగుమతులు ‘భారత ప్రభుత్వంతో జాయింట్ వెంచర్ ద్వారా సుజుకీ మోటార్ కార్పొరేషన్ 1982లో భారత్‌లోకి ప్రవేశించింది. 1983 డిసెంబరులో మారుతీ 800 తొలి కారును తయారు చేసింది. నాటి మా జర్నీలో నేడు మారుతీ ఏటా 4 లక్షల పైగా కార్లను 120కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది’ అని సుజుకీ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ తెలిపారు. -
కార్ల విక్రయాలు మిశ్రమంగా..
వడ్డీరేట్లు తగ్గొచ్చన్న అంచనాలతో కొనుగోళ్లు వాయిదా - కొత్త మోడళ్లతో అమ్మకాలు పుంజుకుంటాయన్న ఆశలు న్యూఢిల్లీ: వాహన రంగం కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. జూన్‌లో కార్ల విక్రయాలు మిశ్రమంగా ఉన్నాయి. దిగ్గజ కంపెనీలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌లు ఒక అంకె వృద్ధినే నమోదు చేశాయి. హోండా కార్స్ ఇండియా, టాటా మోటార్స్ కంపెనీలు రెండంకెల వృద్ధిని సాధించగా, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కంపెనీల అమ్మకాలు క్షీణించాయి. వర్షాలపై ప్రతికూల అంచనాలు, వడ్డీరేట్లు తగ్గొచ్చన్న అంచనాలతో వినియోగదారులు తమ కార్ల కొనుగోళ్లను వాయిదా వేయడం తదితర కారణాల వల్ల కార్ల అమ్మకాల జోరు తగ్గిందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజన్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు. ఇప్పటివరకైతే వర్షాలు సాధారణ స్థాయిలో కురవడం, కొత్త మోడళ్లు రానుండడం వంటి కారణాల వల్ల రానున్న నెలల్లో అమ్మకాలు పుంజుకోవచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా చెప్పారు.


