
వెలుపలి షాక్‌లను తట్టుకుని నిలబడగలదు
మారుతున్న ప్రపంచ వాణిజ్య గమనం
8 శాతం స్థిరమైన వృద్ధి అవసరం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయని, ఆర్థిక ఆంక్షలు–టారిఫ్‌లు ప్రపంచ సరఫరా వ్యవస్థలను మార్చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ తరుణంలోనూ భారత్ 8 శాతం వృద్ధిరేటును ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ‘కౌటిల్య ఆర్థిక సమావేశం 2025’ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. వాణిజ్యం, ఇంధన భద్రత పరంగా ప్రపంచం ఎంతో అసమతుల్యతలను చూస్తోందని, నిర్మాణాత్మక పరివర్తనం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు.
ఈ తరుణంలో భారత్ స్థిరీకరణ శక్తిగా నిలుస్తున్నట్టు చెప్పారు. వెలుపలి షాక్‌లను తట్టుకోగలదన్నారు. ‘‘2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు 8 శాతం మేర స్థిరమైన జీడీపీ వృద్ధికి చేరుకోవడం అవసరం. మనం చూస్తున్నది తాత్కాలిక అస్థిరతలు కాదు. నిర్మాణాత్మక మార్పు. ఒకప్పుడు బలమైన కూటములు అనుకున్నవి నేడు కాల పరీక్షను ఎదుర్కొంటున్నాయి. కొత్త కూటములు అవతరిస్తున్నాయి. కనుక కేవలం ప్రపంచ అస్థిరతలను ఎదుర్కోవడమే కాదు. వాణిజ్యం, ఇంధనం, ఆర్థిక అస్థిరతలతోనూ పోరాడాల్సి రావడం మనముందున్న సవాలు’’అని అని పేర్కొన్నారు.
ప్రపంచ సంస్థలు బలోపేతం కావాలి..
అంతర్జాతీయ సంస్థలు (డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ తదితర) బలోపేతం కావాల్సిన అవసరాన్ని మంత్రి సీతారామన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవి నిరీ్వర్యమవుతుండడంతో ప్రపంచ విశ్వాసం సన్నగిల్లుతున్నట్టు చెప్పారు. ఇవి నేటి వాస్తవాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉందన్నారు.
దేశీయంగా సంస్కరణలు అమలు చేయడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సమన్వయం చేసుకోవడం ద్వారా భారత్ పెరుగుతున్న సుంకాల అవరోధాలను, వాణిజ్య కూటముల్లో మార్పులను అధిగమించగలదని చెప్పారు. పెరిగిపోయిన ఉద్రిక్తతలు, అధిక సుంకాలు, విధానపరమైన తీవ్ర అనిశి్చతులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు మంత్రి తెలిపారు.
అలాగే, పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం, పెరిగిపోయిన నిధుల వ్యయాలు, ఇంధన ధరల్లో అస్థిరతలు సైతం వేధిస్తున్నట్టు చెప్పారు. వీటన్నింటి మధ్య భారత్ స్థిరీకరణ శక్తిగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ ద్రవ్య స్థిరీకరణ, మూలధన వ్యయాల నాణ్యతపై దృష్టి సారించినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. ‘‘జీడీపీలో వినియోగం, పెట్టుబడుల వాటా ఈ కాలంలో స్థిరంగా కొనసాగింది. భారత్ వృద్ధి దేశీ అంశాలపై బలంగా ఆధారపడి ఉంది. ఇది వెలుపలి షాక్‌లను పరిమితం చేస్తోంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని
సాధిస్తోంది’’అని వివరించారు.