సాక్షి ఢిల్లీ: తీవ్రమైన గాలి కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఢిల్లీ వాసులకు కొంత ఉపశమనం లభించింది. ఆదివారం గాలి నాణ్యత కొంత మేర మెరుగుపడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం 305పాయింట్ల వద్ద ఉందని పేర్కొంది. నిన్నటితో పోల్చితే గాలి నాణ్యత కొంతమేర మెరుగుపడినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీ నగరం గాలి నాణ్యత సమస్యతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వాయు కాలుష్యం విపరీతంగా పెరగడంతో అక్కడ ప్రజల దైనందిన జీవితం దెబ్బతినడంతో పాటు వారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పలు సర్వేలు నివేదించాయి. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సైతం కేంద్రాన్ని ఆదేశించింది.
కాగా ప్రస్తుతం ఢిల్లీలో వాయుకాలుష్యం కొంతమేర తగ్గినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెబుతోంది. ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 305గా నమోదైనట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తెలిపింది. మెుత్తంగా 39 మానిటరింగ్ స్టేషన్లలో 26 స్టేషన్లు వెరీపూర్ క్యాటగిరీలో ఉండగా 13 స్టేషన్లు పూర్ క్యాటగిరీలో ఉన్నట్లు పేర్కొన్నాయి. వీటిలో 365 పాయింట్లతో ముండక స్టేషన్ వెరీపూర్ క్యాటగిరీలో ఉన్నట్లు పొల్యూషన్ బోర్డు తెలిపింది.
ఢిల్లీ వాయుకాలుష్యంలో వాహనాల వల్ల అధికంగా 14.8శాతం కాలుష్యం సంభవిస్తుండగా ఇండస్ట్రీస్ 7.3శాతం, గృహాలు 3.6శాతం, నిర్మాణ రంగం 2శాతం కాలుష్యానికి కారణమవుతున్నాయని నివేదికలు తెలిపాయి. అదే విధంగా ఢిల్లీ పరిసరాల్లోని ఝజ్జర్ జిల్లా 13.9 శాతం, రోహ్‌తక్ 5.2శాతం వాయు కాలుష్యానికి కారకాలుగా నిలుస్తున్నాయని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొంది


