డాక్టర్ అని నమ్మి మోసపోవద్దు.. సజ్జనార్ హెచ్చరిక! | Beware of Fake Doctors Hyderabad CP Sajjanar Issues Key Warning | Sakshi
Sakshi News home page

డాక్టర్ అని నమ్మి మోసపోవద్దు.. సజ్జనార్ హెచ్చరిక!

Aug 27 2026 11:40 PM | Updated on Aug 27 2026 11:40 PM

Beware of Fake Doctors Hyderabad CP Sajjanar Issues Key Warning

వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కట్టుబడిన హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు. నగరంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని, 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని అన్నారు.

ఎలాంటి విద్యార్హతలూ, కనీస వైద్య పరిజ్ఞానం లేని వీరు అసలైన వైద్యుల తరహాలోనే నటిస్తూ రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులతో పాటు విచక్షణారహితంగా ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తూ ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారు. అవగాహనారాహిత్యంతో రోజుల తరబడి మందులు వాడాలని సూచించడంతో ప్రజల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

ఇలాంటి మోసగాళ్లపై మా నిఘా, కఠిన చర్యలు కొనసాగుతుండగా.. ప్రజలు కూడా చికిత్స కోసం వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.

  • తాము వెళ్లే క్లినిక్‌లు, ఆసుపత్రుల రిసెప్షన్ వద్ద జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ప్రముఖంగా ప్రదర్శించారో లేదో గమనించాలి.

  • అలాగే వైద్యుల బోర్డులపై పేరు, విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి.

  • వైద్యుల వివరాలపై ఏమాత్రం సందేహం కలిగినా వెంటనే onlinetsmc.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి Doctor Searchలో పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వారి వివరాలను సరిచూసుకోవచ్చు. అక్కడ వివరాలు కనిపించకపోతే వారు నకిలీలని గుర్తించాలి.

  • చికిత్స విధానం లేదా సిబ్బంది ప్రవర్తనపై ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం అర్హత గల ఇతర నిపుణులైన వైద్యుల వద్ద రెండో అభిప్రాయం (Second Opinion) తీసుకోవాలి.

  • ఎక్కడైనా నకిలీ వైద్యులు చలామణి అవుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేసి అమాయకుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నానని సజ్జనార్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement