ఒంటెత్తు పోకడలతో ఒంటరై! | Internal Differences Rock TDP In Singanamala As Party Cadre Turns Against MLA Bandaru Sravani, More Details Inside | Sakshi
Sakshi News home page

ఒంటెత్తు పోకడలతో ఒంటరై!

Aug 28 2026 8:09 AM | Updated on Aug 28 2026 8:16 AM

Local Leaders Not Support To TDP MLA Bandaru Sravani

సాక్షి ప్రతినిధి, అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలకు, ఎమ్మెల్యే బండారు శ్రావణికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గ కేడర్‌కు, ఎమ్మెల్యేకు ఏ మాత్రమూ పొసగడం లేదు. శ్రావణి తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కేడర్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. దీంతో తన నియోజకవర్గంపై ఎమ్మెల్యే బండారు శ్రావణి పూర్తిగా పట్టును కోల్పోయారు. 

అన్నిటికీ కమీషన్లే! 
నియోజకవర్గంలో ఎవరికి ఏ పని కావాలన్నా, పోస్టింగ్‌లు ఇవ్వాలన్నా ప్రజాప్రతినిధికి కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే. సొంత పార్టీ కార్యకర్తల పనులు చేయాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని కరాఖండీగా చెప్పడంతో ఎమ్మెల్యే వ్యవహారశైలిపై కేడర్‌ భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రేషన్‌ డీలర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, యానిమేటర్లు ఇలా చిన్న చిన్న వాటిని కూడా ద్వితీయ శ్రేణి నాయకులు చేయించుకోలేకపోవడంతో ఎమ్మెల్యేకు వారంతా వ్యతిరేక వర్గంగా ఏర్పడ్డారు. 

టూ మెన్‌ కమిటీ నియామకం 
శ్రావణి మొదటి సారి 2019లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆమెకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఓ వర్గం ఏర్పాటైంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమెకు సహకరించేది లేదంటూ ఆ వర్గం చెబుతూ వచ్చింది. అయినా కొందరి ఆశీస్సులతో బండారు శ్రావణి 2024లో టికెట్‌ తెచ్చుకోగలిగారు. అయితే, ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆమె ఒంటెత్తు పోకడలను టీడీపీ సీనియర్‌ నేతలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగా అభాసుపాలయ్యే పరిస్థితి దాపురించింది. ఆ పార్టీ అధిష్టానం నష్టనివారణ చర్యల్లో భాగంగా నియోజకవర్గంలో కేశవరెడ్డి, ఆలం నరసానాయుడులతో టూమెన్‌ కమిటీని నియమించింది.  
సీఎం పర్యటన వాయిదా! 
ఈ నెల మూడో వారంలో సీఎం చంద్రబాబు శింగనమల నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. సీఎం పర్యటనపై నియోజకవర్గ నేతలు సమావేశమై చర్చించారు. వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలి.. సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలపై చర్చించారు. అయితే వేదిక ఏర్పాటు అంశంపై ఎమ్మెల్యేకు, నియోజకవర్గ నేతలకు మధ్య సఖ్యత కుదరలేదు.మొదట నార్పలలో వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, తర్వాత బుక్కరాయసముద్రంలో ఏర్పాటు చేశారు. దీనిపైనా ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో చివరికి సీఎం పర్యటనే వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది.  

చేతులెత్తేసిన ఎమ్మెల్యే శ్రావణి 
టీడీపీ కేడర్‌ పూర్తిగా ఎమ్మెల్యేకు సహకరించే పరిస్థితి కరువైంది. ఆమె సూచించిన ఏ ఒక్కరికీ పార్టీ పరంగా పదవులు దక్కలేదు. పోస్టింగుల విషయంలోనూ ఆమె మాటను ఉన్నతాధికారులు లెక్క చేయడం లేదు. ఎమ్మెల్యే వసూళ్లపై అధిష్టానికి భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో నియోజకవర్గంపై బండారు శ్రావణి పూర్తిగా పట్టును కోల్పోయారు. ఆమె మాటను ఏ ఒక్క లీడరూ లెక్క చేయకపోవడంతో విధిలేని పరిస్థితుల్లోనే పక్క నియోజకవర్గ నేతను అరువు తెచ్చుకున్నారని సొంత పార్టీ కేడరే వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.  

రండి సారూ..
ఇటీవల పుట్లూరు, యల్లనూరు మండలాల ద్వితీయ శ్రేణి నేతలంతా ఎమ్మెల్యేను లెక్క చేయడంలేదు. దీంతో పరిస్థితిని చక్కదిద్దాలని తాడిపత్రి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఎమ్మెల్యే శ్రావణి కోరినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో జేసీ పక్క నియోజకవర్గంలో గురువారం కలియతిరిగారు. జేసీ అండ ఉందని, ఇకపై ఎవరైనా తమ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని శ్రావణి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. రాజకీయ నేతలెవరూ తమ నియోజకవర్గంలోకి పక్క నియోజకవర్గం వారిని అడుగు పెట్టనివ్వరు. ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేనే స్వయంగా పక్క నియోజకవర్గ నేతను బతిమాలుకోవడం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.    

చదవండి: కమిషనర్‌ ఔట్‌.. పీఆర్‌సీ లేదు.. ఉద్యోగులకు వెన్నుపోటు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement