బ్రాహ్మణ వెల్లెంలలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న రాజగోపాల్‌రెడ్డి
నేను ఉండగా కాంగ్రెస్ పార్టీని కబ్జా చేయలేరు
టైం వస్తే నేను సీఎం కాకుండా బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు
రాహుల్ గాంధీ ఏ పదవి ఇచ్చినా పనిచేయడానికి సిద్ధం
వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
నార్కట్‌పల్లి: తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని.. రాష్ట్రంలో రాబోయేది రాజన్న యుగమేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఎవరూ అమలు చేయలేదని చెప్పారు. నాయకుడు ఎలా ఉండాలో, పేదలకు ఏ విధంగా అండగా ఉండాలో స్ఫూర్తినిచ్చే ఆదర్శమూర్తి ఆయన అని కొనియాడారు.
వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి బుధవారం తన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన పార్కులో రూ. 15 లక్షలతో నిర్మించిన వాకింగ్ టాక్, ప్రహరీని ప్రారంభించారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను, వైఎస్సార్ అభిమానులనుద్దేశించి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు.
వైఎస్సార్ శిష్యులుగా మాకు గుర్తింపు..
తనకు సమయం వస్తే బ్రహ్మదేవుడు కూడా సీఎం కాకుండా తనను ఆపలేడని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఏ పదవి ఇచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కొందరు పార్టీని కబ్జా చేయాలని చూస్తున్నారని.. కానీ తాను ఉండగా పార్టీని ఎవరూ కబ్జా చేయలేరన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కోమటిరెడ్డి సోదరులకు వైఎస్సార్ శిష్యులుగా రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ గుర్తింపు ఉందన్నా రు. కాంగ్రెస్ బలోపేతం కావాలంటే ఇతర పార్టీల నేతలను తీసుకోవడం మంచిదేనని.. కానీ తమ ఇంట్లోకి వచ్చి తమనే వెళ్లగొడతామంటే ఊరుకోబోమని రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.
వైఎస్సార్ సీఎంగా ఉండగా తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చొరవతో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును మంజూరు చేసుకోవడం వల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టుకు నిధులివ్వకుండా కేసీఆర్ ఆపితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లోటు బడ్జెట్‌లోనూ సీఎం రేవంత్‌రెడ్డి నిధులు మంజురుచేసి ప్రాజెక్టును ప్రారంభించారని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే హామీలు, అభివృద్ధి పనులు పూర్తి చేయడంతోపాటు కార్యకర్తలను కాపాడుకోవాలన్నారు.
సమయం వచ్చినప్పుడు రాధాకృష్ణకు బుద్ధిచెబుతా..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణ తనపై తొలిపలుకు పేరిట ఎన్ని కథలు రాసినా ఏమీ కాదని.. సూర్యుడిపై ఉమ్మేసిన వారిపైనే పడుతుందని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు ఆయనకు బుద్ధి చెబుతానన్నారు. తనకు మంత్రి పదవి గురించి అధిష్టానం అంతర్గతంగా చర్చిస్తోందని.. వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని.. అలాంటి కార్యకర్తలకు అండగా ఉన్నానని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ఎలాంటి త్యాగమైనా చేసి బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి రాకుండా చేస్తామన్నారు.


