చర్యపై చెరోవైపు! | Congress Internal Rift Intensifies: Telangana | Sakshi
Sakshi News home page

చర్యపై చెరోవైపు!

Sep 3 2026 3:52 AM | Updated on Sep 3 2026 3:52 AM

Congress Internal Rift Intensifies: Telangana

కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బట్టబయలు

సురేఖపై చర్యను వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు

సీనియర్‌ మంత్రి ద్వారా అధిష్టానానికి విన్నపం

సురేఖను తొలగించాల్సిందేనంటున్న సీఎం రేవంత్‌

చర్యలు తీసుకోకపోతే పార్టీ శ్రేణులకు తప్పుడు

సంకేతాలు వెళ్తాయంటున్న కొందరు నేతలు

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో ఆసక్తికరంగా పరిణామాలు

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ వ్యవహారంతో తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలు అన్నట్టుగా పరిస్థితి మారింది. సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు మంత్రి పదవి నుంచి తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తుండగా..మరోవైపు ఆమెపై చర్యలను కొందరు ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నిజానికి రేవంత్‌ మంత్రివర్గంలోని అసంతృప్తి నాయకులుగా పరిగణింపబడేవారు.. గత రెండున్నరేళ్లలో ఏనాడూ సీఎంకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. తమ అసంతృప్తిని ఇన్నాళ్లూ లోలోపలే ఉంచుకున్నారని, తాజాగా సురేఖ ఎపిసోడ్‌ వారికి కలిసొచి్చందని అంటున్నారు.

 ఏఐసీసీలో సురేఖకు అనుకూలంగా ఒకరిద్దరు మంత్రులు తమ వాయిస్‌ వినిపించినట్లు సమాచారం. సురేఖపై తక్షణ చర్యకు బదులుగా ఆమె వివరణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు కొందరు అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది. ఒక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఇద్దరు మంత్రులు, ఓ కీలక నేత సైతం ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించే విషయంలో తొందరపడొద్దని కోరినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీ వర్గానికి చెందిన కీలక మహిళా నేతపై చర్యలు తీసుకుంటే రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని ఏఐసీసీ పెద్దలకు రేవంత్‌కు వ్యతిరేకంగా ఉన్న నేతలు వివరించినట్లు సమాచారం.

 అయితే ముఖ్యమంత్రితో పాటు ఆయన అనుకూలురు ఎట్టి పరిస్థితుల్లోనూ సురేఖపై చర్య తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నట్లు ఓ సీనియర్‌ నాయకుడు వెల్లడించారు. ఒకవేళ సురేఖపై చర్యలు తీసుకోకపోతే..ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో సీఎం రేవంత్‌ పట్టుపై పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందన్నట్టుగా కాంగ్రెస్‌ హైకమాండ్‌కు వారు స్పష్టం చేసినట్లు సమాచారం.  

సురేఖ తాజా వ్యాఖ్యలపై చర్చ 
ఇలావుండగా..ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిసిన అనంతరం సురేఖ చేసిన వ్యాఖ్యలు పార్టీలో మరింత కలకలం రేపాయి. తాజా చర్చకు తెరలేపాయి. టీపీసీసీ క్రమశిక్షణా సంఘానికి ఇదే సమాధానం చెప్పిన మంత్రి..బెంగళూరులో ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే వద్ద, ఢిల్లీలో మీడియా ముందు కూడా అదే వాదన విని్పంచడంతో పాటు మరో అడుగు ముందుకేసి.. సీఎం రేవంత్‌రెడ్డిపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎంపైనే కాకుండా డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రిపై చేసిన వ్యాఖ్యలు సమస్యను మరింత సంక్లిష్టం చేసినట్లు చెబుతున్నారు. 

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో కొత్త చర్చ 
తాజా పరిణామాల నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమ­టి­రెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌­లో కొత్త చర్చకు తెరలేపాయి. ఇతర పార్టీలనుంచి వచ్చిన వా­రు కాంగ్రెస్‌ను ‘కబ్జా’చేయాలనుకుంటే సహించబోమనడం, వైఎస్సార్‌ వర్ధంతి సభలో కార్యకర్తలు ’సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేయగా, ‘ఆ సమయం వస్తే దాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు..’అని వ్యాఖ్యానించడం పార్టీలో సీఎం కుర్చీ పోరును మరోసారి బట్టబయలు చేసిందని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement