source: X
ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్ సోనల్ దినుషా ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ఆగస్ట్) అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్, బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహ్ముద్‌తో కలిసి దినుషా ఈ అవార్డు కోసం పోటీ పడనున్నాడు.
ప్రస్తుతం దినుషా పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. భారత్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో అతడు ఏకంగా 420 పరుగులు (140 సగటు) చేశాడు. భారత్‌తో సిరీస్‌కు ముందు దినుషా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. తన టెస్టు కెరీర్‌లో తొలి ఐదు ఇన్నింగ్స్‌ల్లో అతడి ఖాతాలో ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే ఉంది.
అయితే భారత్‌తో సిరీస్‌లో మాత్రం దినుషా పూర్తిగా భిన్నమైన ఆటగాడిగా కనిపించాడు. గాలేలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన దినుషా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 84 పరుగులతో రాణించాడు. అయితే ఆ మ్యాచ్‌లో శ్రీలంక 165 పరుగుల తేడాతో ఓడిపోయింది. సిరీస్‌లో 0-1తో వెనుకబడిన శ్రీలంకకు రెండో టెస్టులో దినుషా అండగా నిలిచాడు.
ఒకే టెస్టులో రెండు సెంచరీలు
కొలంబోలో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక టెస్టులో దినుషా మరోసారి చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 162 బంతుల్లో 103 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు గంటలకు పైగా క్రీజులో నిలిచి 264 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా శ్రీలంకను ఓటమి నుంచి కాపాడాడు.
రాబిన్సన్ విషయానికొస్తే.. ఆగస్ట్ నెలలో పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్టుల్లో అతడు 16 వికెట్లు పడగొట్టాడు. రాబిన్సన్ ప్రదర్శనల కారణంగా ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది.
మరోవైపు బంగ్లా ఫాస్ట్ బౌలర్ హసన్ మహ్ముద్ ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన చేశాడు. డార్విన్‌లో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.
చదవండి: భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 వాయిదా..?


