PC: PCB/X
సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ క్రికెట్ గురించి రోజుకో కొత్త వార్త తెరమీదకు వస్తోంది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్, సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు పాక్ జాతీయ సైబర్ నేర దర్యాప్తు సంస్థ (NCCIA) నోటీసులు ఇచ్చిందని తాజా సమాచారం.
ఏడుగురిని తప్పించి..
కాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా... పాక్ బోర్డు కఠిన చర్యలు చేపట్టింది. మూడో టెస్టుకు ముందు ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది.
కోచింగ్ స్టాఫ్‌పైనా వేటు
అంతేకాదు టెస్టు హెడ్‌కోచ్ పదవి నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ను అర్ధాంతరంగా తప్పించిన పాక్ బోర్డు.. బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్‌ను తొలగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన మిస్బా ఉల్ హక్ సెలక్టర్ పదవికి రాజీనామా చేశాడు.
ఇదిలా ఉంటే.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ గాయం సాకు చూపి రెండో టెస్టులో బ్యాటింగ్ చేయకుండా తప్పించుకున్నాడని.. ఫిక్సింగ్‌లో భాగంగానే ఇలా చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజ్వాన్ సైతం క్రమశిక్షణను ఉల్లంఘించాడని పాక్ మీడియాతో కథనాలు వచ్చాయి.
నక్వీ ఆదేశాలతోనే?
ఈ క్రమంలో తాజాగా జియో టీవీ మరో బాంబు పేల్చింది. ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్‌లకు NCCIA నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. అధికారులు వీరిద్దరిని విచారణకు రావాల్సిందిగా ఆదేశించినట్లు పేర్కొంది. కాగా NCCIA పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ పరిధిలో ఉంటుంది. ఈ శాఖకు మోసిన్ నక్వీ మంత్రి అన్న సంగతి తెలిసిందే.
అంతేకాదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా నక్వీనే చైర్మన్. ఈ నేపథ్యంలో NCCIA ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్‌లకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీరిద్దరితో పాటు మరో పాక్ క్రికెటర్‌ను కూడా అధికారులు విచారించనున్నట్లు సమాచారం.
ఫిక్సింగ్ అనుమానాలు
ఇదిలా ఉంటే.. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తర్వాత పాక్ బోర్డు ఇమామ్, రిజ్వాన్‌ల ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిక్సింగ్‌కు సంబంధించిన ఆధారాలు మొబైల్‌లో ఉన్నాయని.. అందుకే NCCIA సైతం ఆ దిశగా విచారణ మొదలుపెట్టిందనే ప్రచారం జరుగుతోంది.
చదవండి: గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ అవుట్.. రీప్లేస్‌మెంట్ ప్రకటించిన బీసీసీఐ


