‘నా చావు కోరుకుంటున్నారు.. నేను మొండిదాన్ని’ | Vinesh Phogat Sensational Allegations On WFI, Claims Wrestling Body Wants Her Death Amid Ongoing Selection Row | Sakshi
Sakshi News home page

‘నా చావును కోరుకుంటున్నారు.. నేను మొండిదాన్ని’

May 31 2026 12:02 PM | Updated on May 31 2026 2:55 PM

They Wants Me To Die: Vinesh Phogat Sensational Allegations on WFI

భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) తన చావును కోరుకుంటోందని ఆరోపించింది. కాగా 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన అనంతరం వినేశ్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. 

ఎమ్మెల్యేగా విజయం
కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో ఆమె పతకానికి దూరమైంది. ఆ తర్వాత రెజ్లింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన వినేశ్‌... రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించింది. 

తల్లిగా మారిన అనంతరం
ఇటీవల తల్లిగా మారిన అనంతరం తిరిగి మ్యాట్‌పై అడుగు పెట్టాలనుకున్న ఈ హర్యానా అథ్లెట్‌కు భారత రెజ్లింగ్‌ సమాఖ్య షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో న్యాయపోరాటం చేసిన వినేశ్‌ ఆసియా క్రీడల సెలక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొంది. అయితే, ఇక్కడా ఆమెకు చుక్కెదురైంది.

మీనాక్షి గోయత్‌ చేతిలో ఓటమి
ఎన్నో ఆరోపణలు, మరెన్నో పోరాటాల తర్వాత సుప్రీంకోర్టు అనుమతితో సెలక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వినేశ్‌ అనూహ్య రీతిలో సెమీఫైనల్లో పరాజయం పాలైంది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన మహిళల 53 కేజీల సెమీఫైనల్‌ బౌట్‌లో వినేశ్‌ 4–6 పాయింట్‌ల తేడాతో మీనాక్షి గోయత్‌ చేతిలో ఓడిపోయింది. 

ప్రతి పాయింట్‌ కోసం ప్రాణం పెట్టాను
ఈ నేపథ్యంలో..‘నేను విఫలమయ్యానని భావించడం లేదు. నేను మ్యాట్‌పై కేవలం ప్రత్యర్థితో మాత్రమే పోరాడటం లేదు... మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నా. ప్రతి పాయింట్‌ కోసం ప్రాణం పెట్టాను. నాకు సరైన అవకాశం లభించలేదు. 

నాతో పోటీపడి గెలిచిన రెజ్లర్లపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. వాళ్లు నాతో బౌట్‌లో పాల్గొనాలని కలలు కన్నారు. నేను తప్పక తిరిగి వస్తా’ అని వినేశ్‌ భావోద్వేగానికి గురైంది. అదే సమయంలో.. ‘నేను ఓడిపోయానని తెలిసి డబ్ల్యూఎఫ్‌ఐ అధికారులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు.

నా చావును కోరుకుంటున్నారు.. నేను మొండిదాన్ని
పర్లేదు.. ఇప్పుడు వాళ్లను సెలబ్రేట్‌ చేసుకోనివ్వండి. నేను చాలా మొండిదాన్ని. నాకు పట్టుదల ఎక్కువ. ఇలాంటి చేదు అనుభవాలే నన్ను మరింత వేగంగా ముందుకు నడిపిస్తాయి. ఇవే నా ప్రయాణానికి ఇంధనాలు. నేను కచ్చితంగా తిరిగి వస్తా.

నా ప్రతిభపై సందేహాలు వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా ప్రదర్శనతోనే సమాధానం చెప్తా. నేను వీలైనంత త్వరగా చావాలని ఈ రెజ్లింగ్‌ సమాఖ్య కోరుకుంటోంది. ప్రస్తుతానికైతే వారి ఆలోచన ఇదే’ అని వినేశ్‌ సంచలన ఆరోపణలు చేసింది. IANSతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

తీవ్ర గందరగోళం
కాగా ఆసియా క్రీడల సెలక్షన్‌ ట్రయల్స్‌ తొలి రౌండ్‌లో వినేశ్‌ 7–1తో జ్యోతిపై అలవోక విజయం సాధించింది. దీంతో వినేశ్‌ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొన్నారు. ఇక క్వార్టర్‌ ఫైనల్లో వినేశ్‌ 7–6 పాయింట్ల తేడాతో నిషు కుమారిని ఓడించింది. ఈ బౌట్‌ జరుగుతున్న సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది.

భారత బృందంలో వీరికి చోటు
వినేశ్‌ పదే పదే రిఫరీ నిర్ణయాన్ని సవాలు చేయడం... ఆమె అభిమానులు నినాదాలతో హోరెత్తించడం... టెక్నికల్‌ ఇబ్బందులు ఇలా విజేతను నిర్ణయించేందుకు చాలా సమయం పట్టింది. 

మరోవైపు.. సెమీస్‌లో వినేశ్‌పై గెలిచిన మీనాక్షి... తుది పోరులో అంతిమ్‌ చేతిలో ఓడిపోయింది. అంతిమ్‌తో పాటు నిషా దహియా (68 కేజీలు), మనీషా (57 కేజీలు), దీపాన్షి (50 కేజీలు) ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందంలో చోటు దక్కించుకున్నారు.  

చదవండి: అది సెలక్టర్ల పని: సచిన్‌ టెండుల్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement