అది సెలక్టర్ల పని: వైభవ్‌ సూర్యవంశీపై సచిన్‌ వ్యాఖ్యలు | Sachin Tendulkar Backs Vaibhav Sooryavanshi To Play Tests, Urges Selectors Not To Rush Him, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

అది సెలక్టర్ల పని: వైభవ్‌ సూర్యవంశీపై సచిన్‌ వ్యాఖ్యలు

May 31 2026 11:02 AM | Updated on May 31 2026 1:34 PM

Leave that to Selectors: Tendulkar Blunt Verdict On Vaibhav Suryavanshi

వైభవ్‌- సచిన్‌ (PC: BCCI/X)

ఐపీఎల్‌-2026లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ. రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా 16 మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్‌ ఇన్నింగ్స్‌లో ఓ విధ్వంసకర శతకం (36 బంతుల్లోనే) కూడా ఉండటం విశేషం. క్వాలిఫయర్‌-2 ముగిసేసరికి అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ కూడా తన వద్దే పెట్టుకున్నాడు ఈ చిచ్చరపిడుగు.

టీమిండియాకు ఆడించాలనే డిమాండ్లు
ఇక అంతకు ముందు భారత అండర్‌-19 జట్టు తరఫున కూడా అదరగొట్టాడు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). ఈ పరిణామాల క్రమంలో ఇప్పటికే భారత్‌-‘ఎ’ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. అయితే, వీలైనంత త్వరగా ఈ పదిహేనేళ్ల పిల్లాడిని టీమిండియాకు ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

అత్యద్భుతం
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ వైభవ్‌ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రతి ఒక్కరూ సూర్యవంశీ గురించే మాట్లాడుతున్నారు. నేను కూడా అతడి బ్యాటింగ్‌ చూశాను. నిజంగా అత్యద్భుతం. అతడు చాలా చాలా ప్రత్యేకమైన ఆటగాడు.

కేవలం బంతిని బాదడమే కాదు.. బ్యాటింగ్‌ చేసేటప్పుడు అతడు మణికట్టును ఉపయోగించే విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. మైదానం నలుమూలలా షాట్లు బాదాలంటే రిస్ట్‌ వర్క్‌ అత్యంత ముఖ్యం. వైభవ్‌ ఏదో దూకుడుగా, గుడ్డిగా బంతిని బాదడం లేదు.

బాల్‌ను ఎదుర్కొనే ముందు లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను సరిగ్గా అంచనా వేసి షాట్‌ ఆడుతున్నాడు. అందుకే మిగతా వారితో పోలిస్తే అతడు ఎక్కువగా బౌండరీలు బాదగలుగుతున్నాడు. అతడు టీమిండియాకు ఆడాలని అందరూ కోరుకుంటున్నారు.

టెస్టు క్రికెట్‌ ఆడితే చూడాలని ఉంది..
అయితే, ఇలాంటి విషయాలు వైభవ్‌పై ఒత్తిడి పెంచుతాయి. ఏదేమైనా అతడు తన సహజ శైలిని వదులుకోవద్దు. వైభవ్‌ టెస్టు క్రికెట్‌ ఆడితే చూడాలని ఉంది. మిగతా ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో సవాళ్లు ఎక్కువగా ఉంటాయి.

ప్రతీ బంతి ఒక ప్రశ్న లాంటిదే. దానికి బదులిచ్చే క్రమంలో పరిష్కారం కనుగొనే ఆలోచనా విధానం పెరుగుతుంది. కెరీర్‌లో చివరి రోజు వరకూ కూడా ఈ సవాళ్లు కొనసాగుతూనే ఉంటాయి. ఏదేమైనా వైభవ్‌ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. తాను చేస్తున్న పనిపట్ల అతడికి చక్కటి అవగాహన ఉంది.

అది సెలక్టర్ల పని
అందరూ కోరుకున్నట్లుగానే వైభవ్‌ టెస్టు క్రికెట్‌ ఆడితే ఎంతో బాగుంటుంది. అయితే, అతడిపై ఒత్తిడి పెంచకూడదు. ప్రతిభావంతుడైన ఆటగాడికి అవకాశాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో.. అతడిపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.

ఇలా ఆడాలి.. అలా ఆడాలి అంటూ మరీ ఎక్కువగా సూచనలు ఇచ్చి అతడిని గందరగోళంలోకి నెట్టేయకూడదు. వైభవ్‌ ఎంపిక గురించిన అంశాన్ని సెలక్టర్లకు వదిలివేయాలి. అతడిని ఏ జట్టుకు ఎంపిక చేయాలో వారికే తెలుసు. అది వారి బాధ్యత కూడా!.. కాబట్టి వైభవ్‌ విషయంలో తొందరపడటం మంచిది కాదు’’ అని సచిన్‌ టెండుల్కర్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు.

చదవండి: ఐపీఎల్‌ ఎగ్గొట్టి.. అక్కడెలా ఆడావు?.. సంగక్కర ఆగ్రహం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement