ఐపీఎల్‌ ఎగ్గొట్టి.. అక్కడెలా ఆడావు?.. సంగక్కర ఆగ్రహం | Kumar Sangakkara Slams Sam Curran Missing IPL And Playing Domestic League T20 Blast, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ఎగ్గొట్టి.. అక్కడెలా ఆడావు?.. సంగక్కర ఆగ్రహం

May 30 2026 5:21 PM | Updated on May 30 2026 5:50 PM

Kumar Sangakkara Slams Sam Curran Missing IPL Playing Domestic League

సంగక్కర (PC: BCCI/IPL)

గతేడాది ఐపీఎల్‌లో విఫలమైన రాజస్తాన్‌ రాయల్స్‌.. తాజా ఎడిషన్‌లో మాత్రం అదరగొట్టింది. ఐపీఎల్‌-2026లో ప్లే ఆఫ్స్‌ చేరడమే కాకుండా.. ఎలిమినేటర్‌ గండం కూడా దాటి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది.

అయితే, ఫైనల్‌కు చేరే క్రమంలో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడి ఇంటిబాటపట్టింది. ముల్లన్‌పూర్‌ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలుకావడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

సంజూ స్థానంలో..
గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగు విజయాలతో తొమ్మిదోస్థానంలో నిలిచిన రాజస్తాన్‌.. ఈసారి మాత్రం ఈ మేరకు అద్భుతంగానే రాణించింది. నిజానికి ఐపీఎల్‌-2026కు ముందు రాజస్తాన్‌ తమ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ట్రేడ్‌ చేసింది.

సంజూ స్థానంలో కెప్టెన్‌గా రియాన్‌ పరాగ్‌ను నియమించిన రాయల్స్‌.. ఓపెనర్‌గా వైభవ్‌ సూర్యవంశీని పూర్తిస్థాయిలో బరిలోకి దించింది. ఈ రెండు నిర్ణయాలు రాయల్స్‌కు బాగా కలిసి వచ్చాయి. ఈ సీజన్‌లో వైభవ్‌ పదహారు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుడిగా (క్వాలిఫయర్‌-2 ముగిసేసరికి) నిలిచాడు.

సీజన్‌ మొత్తానికి దూరం
ఇదిలా ఉంటే.. సంజూకు బదులు రాజస్తాన్‌ చెన్నై నుంచి ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్‌ కర్రాన్‌ (రూ. 2.4 కోట్లు)లను తీసుకుంది. అయితే, సామ్‌ కర్రాన్‌ గజ్జల్లో గాయం అని చెప్పి సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో రాజస్తాన్‌ శ్రీలంక స్టార్‌ దసున్‌ షనకను తీసుకుంది.

అయితే, గాయం పేరు చెప్పి తప్పుకొన్న సామ్‌ కర్రాన్‌ ఇంగ్లండ్‌ దేశీ టోర్నీ టీ20 బ్లాస్ట్‌లో సర్రే జట్టుకు సుమారుగా మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను కావాలనే నిర్లక్ష్యం చేశాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం గురించి రాజస్తాన్‌ రాయల్స్‌ హెడ్‌కోచ్‌ కుమార్‌ సంగక్కర తాజాగా స్పందించాడు.

సర్రే తరఫున ఆడటం నేను చూశాను
‘‘సామ్‌ కర్రాన్‌కు గాయమైందని మాకు సమాచారం అందింది. కానీ అతడు సర్రే తరఫున 2- 3 మ్యాచ్‌లు ఆడటం నేను చూశాను. నిజంగా ఈ విషయం మమ్మల్ని చాలా నిరాశపరిచింది.

అతడు మా జట్టుతో ఆడాలని మేము కోరుకున్నాము. అందుకే జట్టులో చేర్చుకున్నాము. కానీ అతడు ఇలా చేశాడు. కాకపోతే ముందుగానే విషయం చెప్పినందు వల్ల షనకను తీసుకువచ్చాము. ఆటగాళ్ల కెరీర్‌లో గాయాలు సహజమే.

మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలి
అయితే, కొన్ని తీవ్రమైన గాయాలు ఉంటాయి. మరికొన్ని నామమాత్రంగా ఉంటాయి. ఏదేమైనా బీసీసీఐ ఈ విషయంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. నిబంధనలు కఠినతరం చేయడం అత్యంత ముఖ్యం’’ అని సంగక్కర సామ​ కర్రాన్‌ తీరుపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా అకస్మాత్తుగా ఐపీఎల్‌కు దూరమైతే తదుపరి వేలంలో పాల్గొనకుండా రెండేళ్లపాటు నిషేధం విధిస్తోంది బీసీసీఐ. అయితే, గాయాలు, అనారోగ్య కారణాల వల్ల దూరమైన వారికి మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది.

చదవండి: ఫైనల్‌కు ముందు ఆర్సీబీకి షాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement