సెలక్షన్స్‌లో పాల్గొనేందుకు సుప్రీం కోర్టు అనుమతి
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు సుప్రీం కోర్టులో కూడా ఊరట లభించింది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు సుప్రీం అనుమతి ఇచ్చింది. నేడు, రేపు జరిగే ట్రయల్స్‌లో ఆమెను అనుమతించాలంటూ జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని బెంచ్ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)ను ఆదేశించింది. వినేశ్‌ను సెలక్షన్స్‌కు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఇటీవలి తీర్పును డబ్ల్యూఎఫ్‌ఐ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. సెలక్షన్స్‌లో పాల్గొనే అర్హత వినేశ్‌కు లేదంటూ వాదించింది.
అయితే వాదనను సుప్రీం కోర్టు బెంచ్ సమర్థించలేదు. ‘వినేశ్ సెలక్షన్స్‌లో పాల్గొనవచ్చంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో అందరికీ ఆశలు, అంచనాలు పెరిగాయి. ఇలాంటి స్థితిలో ఆమెను ఇంటికి వెళ్లిపోమని మేం చెప్పడం సరైంది కాదు. అందుకే ఇలాంటి స్పష్టత ఇస్తున్నాం. ఆమె సెలక్షన్ ట్రయల్స్‌లో కచ్చితంగా పాల్గొనవచ్చు’ అని పేర్కొంది. మరోవైపు హైకోర్టు తీర్పు ప్రకారం వినేశ్ సెలక్షన్ ట్రయల్స్ ఇద్దరు ప్రభుత్వ పరిశీలకుల సమక్షంలో జరగడంతో పాటు మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం తరఫున భారత మాజీ ఫుట్‌బాలర్ అదితి చౌహాన్, భారత హాకీ మాజీ కెప్టెన్ ఎంఎం సోమయ దీనికి హాజరవుతారు. గోల్‌కీపర్‌గా అదితి 57 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా, 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో సోమయ సభ్యుడిగా ఉన్నారు. వినేశ్ 50 కేజీల విభాగం సెలక్షన్ ట్రయల్స్‌లో మాత్రమే పాల్గొనేందుకు డబ్ల్యూఎఫ్‌ఐ అనుమతి ఇచ్చింది. చివరిసారి ఆమె 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగంలోనే పోటీపడిందని, అందుకే ఈసారి కూడా ఆమెకు అదే వెయిట్ కేటగిరీలో అనుమతి ఇస్తామని డబ్ల్యూఎఫ్‌ఐ వర్గాలు తెలిపాయి.


