తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై 94 పరుగులతో జయభేరి
షఫాలీ మెరుపులు
రాణించిన దీప్తి, నందని, శ్రీచరణి
మహిళల టి20 ఆసియా కప్
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 94 పరుగుల తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఓపెనర్ షఫాలీ వర్మ (36 బంతుల్లో 64; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో అదరగొట్టింది.
ప్రతీక రావల్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (19; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. టాప్–3 రాణించడంతో 8.5 ఓవర్లలో 91/1తో పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా... చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయింది. థాయ్‌లాండ్ బౌలర్లలో లవోమి 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనలో థాయ్‌లాండ్ 16.1 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌటైంది.
నన్నపట్ కొంచరోన్కై (48 బంతుల్లో 41; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. 150వ అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన దీప్తి శర్మ ఒక్క పరుగు ఇవ్వకుండానే 3 వికెట్లు పడగొట్టడం విశేషం. నందని శర్మ 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా... ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి 10 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం హాంకాంగ్‌తో ఆడుతుంది. నేడు బంగ్లాదేశ్‌తో ఇండోనేసియా తలపడనుంది.
ప్రతీక @ 95
ఈ మ్యాచ్ ద్వారా ప్రతీక రావల్ భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన 95వ క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. గాయంతో జెమీమా రోడ్రిగ్స్ ఆసియా కప్‌నకు దూరం కాగా... ఆమె స్థానంలో ప్రతీకాకు చోటు దక్కింది. ఢిల్లీకి చెందిన ప్రతీక ఇప్పటికే టీమిండియా తరఫున ఒక టెస్టు, 27 వన్డేలు ఆడింది. మ్యాచ్ ఆరంభానికి ముందు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ చేతుల మీదుగా ప్రతీక క్యాప్ అందుకుంది. కాశ్వీ గౌతమ్, అనుష్క శర్మ, నందని శర్మ, ప్రేమ రావత్ తర్వాత ఈ ఏడాది భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేసిన ఐదో క్రికెటర్‌గా ప్రతీక నిలిచింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: స్మృతి (రనౌట్) 19, షఫాలీ (సి అండ్ బి) లయోమి 64; ప్రతీక (బి) లయోమి 22; హర్మన్‌ప్రీత్ (సి) మాయ (బి) పుథవాంగ్ 5; భారతి (సి) సువంచోన్రాఠి (బి) చతురోంగ్రత్నా 13; రిచా (సి) పుథవాంగ్ (బి) లయోమి 0; దీప్తి (రనౌట్) 5; ప్రేమ (స్టంప్డ్) కొంచరోన్కై (బి) చతురోంగ్రత్నా 6; నందని (బి) సుథిరువాంగ్ 1; శ్రీచరణి (నాటౌట్) 6; క్రాంతి (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–38, 2–91, 3–108, 4–112, 5–112, 6–127, 7–136, 8–137, 9–137. బౌలింగ్: మాయ 3–0–31–0; పుథవాంగ్ 4–0–37–1; చతురోంగ్రత్నా 3–0–31–2; ఒన్నిచా 3–0–19–0; లయోమి 4–0–26–3; సుథిరువాంగ్ 3–0–14–1.

థాయ్‌లాండ్ ఇన్నింగ్స్: నథాకాన్ (బి) క్రాంతి 4; మాయ (సి) ప్రతీక (బి) నందని 6; కొంచరోన్కై (సి) రిచా (బి) దీప్తి 41; సువంచోన్రాఠి (ఎల్బీ) శ్రీచరణి 1; సుథిరువాంగ్ (సి) స్మృతి (బి) శ్రీచరణి 5; నయోమి (ఎల్బీ) (బి) దీప్తి 1; చైహాన్ (సి) నందని (బి) దీప్తి 0; లయోమి (సి) షఫాలీ (బి) నందని 6; చతురోంగ్రత్నా (సి) రిచా (బి) నందని 0; ఒన్నిచా (రనౌట్) 0; పుథవాంగ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 65. వికెట్ల పతనం: 1–4, 2–16, 3–35, 4–43, 5–44, 6–44, 7–60, 8–60, 9–60, 10–65. బౌలింగ్: క్రాంతి 4–0–26–1; నందని 4–0– 18–3; శ్రీచరణి 3–0–10–2; ప్రేమ 4–1–11–0; దీప్తి 1.1–1–0–3.


