పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్
సెమీఫైనల్లో చోటు కోసం బెన్ షెల్టన్‌తో ‘ఢీ’
ఏడో సీడ్ మెద్వెదెవ్‌కు టియాఫో షాక్
న్యూయార్క్: గాయం నుంచి కోలుకున్నాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్ దూసుకుపోతున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ స్పెయిన్ స్టార్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 20వ సీడ్ టామీ పాల్ (అమెరికా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అల్‌కరాజ్ 6–4, 6–3, 6–4తో గెలుపొందాడు. 2 గంటల 21 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ అల్‌కరాజ్‌కు ఇబ్బంది ఎదురుకాలేదు.
మణికట్టు గాయంతో నాలుగు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న అల్‌కరాజ్ యూఎస్ ఓపెన్‌తో పునరాగమనం చేశాడు. టామీ పాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్‌కరాజ్ 33 విన్నర్స్ కొట్టాడు. 32 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన ఈ ప్రపంచ మాజీ నంబర్‌వన్ తన సర్వీస్‌ను ఒక్కసారి మాత్రమే కోల్పోయాడు.
సెమీఫైనల్లో చోటు కోసం అమెరికా ఆశాకిరణం, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ తో అల్‌కరాజ్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్ 6–2, 6–3, 6–4తో సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించాడు. 1 గంట 52 నిమిషాల పోరులో షెల్టన్ 12 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోని ఈ అమెరికా ప్లేయర్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు 2021 చాంపియన్, ఏడో సీడ్ మెద్వెదెవ్ కథ ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది.
11వ సీడ్ టియాఫో (అమెరికా) 7–6 (7/1), 6–4, 7–6 (8/6)తో మెద్వెదెవ్‌ను ఓడించి ఈ టోర్నీలో నాలుగోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ అలెక్స్ మిచెల్సన్ (అమెరికా) 7–6 (8/6), 6–4, 6–4తో ఎచ్‌వెరీ (అర్జెంటీనా)పై గెలిచి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నిలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు.
స్వియాటెక్ అవుట్
మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్, 2022 చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. 121వ ర్యాంకర్ కిన్‌వెన్ జెంగ్ 7–5, 6–3తో ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత స్వియాటెక్‌ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), ఆరో సీడ్ నొస్కోవా (చెక్ రిపబ్లిక్), ఐదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో పెగూలా 6–3, 6–4తో సొరానా కిర్‌స్టియా (రొమేనియా)పై, నొస్కోవా 7–5, 5–7, 6–4తో 11వ సీడ్ మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్)పై, ఆండ్రీవా 5–7, 6–4, 6–3తో పొటపోవా (ఆ్రస్టియా)పై గెలుపొందారు.


