source: X
ఇటీవల జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియాను గడగడలాడించిన శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్ సోనల్ దినుషాకు ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ఆగస్ట్) అవార్డు లభించింది. ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్, బంగ్లాదేశ్ సంచలన పేసర్ హసన్ మహముద్ పోటీపడినప్పటికీ.. దినుషానే ఈ అవార్డు వరించింది.
వీరు ముగ్గురు ఆగస్ట్ నెలలో టెస్ట్ క్రికెట్‌లో విశేషంగా రాణించారు. దినుషా భారత్‌తో ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో 140 సగటున ఏకంగా 420 పరుగులు (3 శతకాలు, ఓ హాఫ్ సెంచరీ) సాధించగా.. పాకిస్తాన్‌తో జరిగిన తొలి రెండు టెస్ట్‌ల్లో రాబిన్సన్ 16 వికెట్లు తీశాడు. హసన్ మహముద్ ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 9 వికెట్లతో చెలరేగి, ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు చారిత్రక విజయాన్నందించాడు.
మహిళల విషయానికొస్తే.. ఆగస్ట్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐల్ ఆఫ్ మ్యాన్ క్రికెటర్ లూసీ బార్నెట్‌కు లభించింది. థాయ్‌లాండ్ స్పిన్నర్ సులీపోర్న్ లావోమీ, వికెట్‌కీపర్-బ్యాటర్ నన్నపట్ కొంచరోయెంకై నుంచి పోటీ ఎదుర్కొన్న 19 ఏళ్ల బార్నెట్ ఈ అవార్డు దక్కించుకుంది. ఆగస్ట్ నెలలో బార్నెట్ విశేషంగా రాణించింది. నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే 257 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపికైంది.
ఇదీ చదవండి: విండీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన పాక్ ప్లేయర్


