టీమిండియా (Photo Credit: BCCI X)
అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకుంది. తొలి టీ20లో ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో ఓడించిన శ్రేయస్ అయ్యర్ సేన... రెండో మ్యాచ్‌లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా- అఫ్గాన్ మధ్య గురువారం నామమాత్రపు మూడో టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. దీంతో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరిగింది.
ఇషాన్‌కు విశ్రాంతి
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘సిరీస్ గెలిచాం కాబట్టి మూడో టీ20లో వైభవ్‌ను ఆడించడం మంచి ఆప్షనే అవుతుంది. నా అభిప్రాయం ప్రకారం.. రెండు మ్యాచ్‌లలో సత్తా చాటిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లలో ఎవరో ఒకరికి విశ్రాంతినిచ్చినా బాగానే ఉంటుంది.
ఇటీవల దులిప్‌ట్రోఫీలోనూ ఇషాన్ అదరగొట్టాడు. కాబట్టి అతడికి బ్రేక్ ఇవ్వడం మంచిది. అభిషేక్ లేదంటే సంజూతో కలిసి వైభవ్ ఓపెనింగ్ చేస్తాడు. కావాలనుకుంటే సంజూ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు’’ అని వసీం జాఫర్ పేర్కొన్నాడు. కాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గాన్ బోర్డు టీమిండియాకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20కి వసీం జాఫర్ సూచించిన భారత తుదిజట్టు
సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా.


