breaking news
Jamui district
-
బిహార్‌లో నడి రోడ్డుపై దుశ్శాసన పర్వం
జముయీ/న్యూఢిల్లీ: బిహార్‌లో ఇద్దరు టీనేజీ విద్యార్థులను ఏడుగురు ఆగంతకులు దారుణంగా వేధించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ దుశ్శాసన పర్వంపై రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని మరో నలుగురి కోసం వేట మొదలెట్టారు. అసలేం జరిగింది? జముయీ జిల్లా కేంద్రానికి చెందిన ఒక టీనేజీ అమ్మాయి, టీనేజీ అబ్బాయి ఒకే స్కూల్లో పదో తరగతి చదువుతున్నారు. సెప్టెంబర్ 19వ తేదీన కోచింగ్ సెంటర్లో క్లాసుకు వెళ్లి అటు నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మడ్వా పహాడ్‌కు వెళ్లి తిరిగొస్తుండగా వీళ్లను గమనించిన కొందరు ఆగంతకులు మార్గమధ్యంలో వీళ్లను లఖీసరాయ్ రోడ్డుపై 7 గంటల సమయంలో అడ్డగించి దారుణంగా వేధించారు. వదిలేయాలని అమ్మాయి కాళ్లావేళ్లా పడిన కనికరం చూపలేదు. అమ్మాయిపై లైంగికదాడికి యత్నించారు. ఇదంతా ఒక ఆగంతకుడు తన మొబైల్లో చిత్రీకరించాడు. టీనేజీ అబ్బాయిని కొట్టారు. పారిపోయేందుకు ప్రయత్నించిన టీనేజర్లను వెంటబడిమరీ ఆగంతకులు వేధించారు. అల్లరిమూకలో ఒకడు అమ్మాయిని గట్టిగా అదిమిపట్టి ఎత్తుకెళ్లే ప్రయత్నంచేశాడు. ఈ దారుణోదంతం తాలూకు వీడియో ఆదివారం రాత్రి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. విషయం తెల్సి రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలోని బైక్ నంబర్‌ప్లేట్ ఆధారంగా ముగ్గురిని అరెస్ట్‌చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. సబ్ డివిజనల్ మహిళా పోలీస్ ఆఫీసర్ దీప్తీ మోనాలీ సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జుమాయీ ఎస్పీ బిశ్వజీత్ దయాళ్ తెలిపారు. భారతీయ న్యాయసంహిత చట్టం, పోక్సో చట్టాల్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంధభక్తులకు ఇది సాధారణం: రాహుల్ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బిహార్‌లోని బీజేపీ ప్రభుత్వహయాంలో అమ్మాయిలకు రక్షణలేకుండా పోయిందన్నారు. ‘‘టీనేజీ అమ్మాయి చేతులు జోడించి బతిమాలింది. అయినాసరే వాళ్లు అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించారు. వాళ్లకీ స్వేచ్ఛ ఎవరిచ్చారు?. అమ్మాయి ఏడు గంటలకు కూడా రోడ్డుపై వెళ్లలేని దుస్థితి ఎందుకొచ్చింది? ఇది పితృస్వామ్య వ్యవస్థ తాలూకు దురహంకారం కాదా? ఇంతటి దారుణ ఘటనను కొందరు అంధభక్తులు సాధారణ విషయంగా చిత్రీకరించే దుస్సాహసం చేస్తున్నారు. అందుకే ఇలాంటి అల్లరిమూకలు తామేదో ‘సంస్కృతి’ని కాపాడే వ్యక్తులుగా ఇలాంటి దారుణాలకు తెగిస్తున్నారు. నిందితులను పోక్సో చట్టం కింద విచారించి కఠిన శిక్షలు వేయాలి’’అని రాహుల్ డిమాండ్‌చేశారు. ఘటనపై బిహార్ శాసనసభలో విపక్ష నేత, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ స్పందించారు. ‘‘బీజేపీ నేత సామ్రాట్ చౌదరి అసమర్థమైన బిహార్ సీఎంగా మిగిలిపోయారు. ఇలాంటి ఘటనకు ప్రధాని మోదీ బాధ్యతవహించాల్సిందే’’అని డిమాండ్ చేశారు. నివేదిక కోరిన జాతీయ మహిళా కమిషన్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. వెంటనే నిందితులను అరెస్ట్‌చేసి చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని బిహార్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహాత్కార్ ఆదేశాలు జారీచేశారు. ఏడు రోజుల్లోపు ఈ అంశంలో నివేదిక ఇవ్వాలని సూచించారు. ఘటనపై బిహార్ మహిళా కమిషన్ చైర్పర్సన్ అప్సరా మిశ్రా సైతం జిల్లా మేజిస్ట్రేట్ ను నివేదిక కోరారు. ఘటనపై తృణమూల్కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్‌శర్మ చెప్పారు. -
విద్యార్థిని వదిలేసిన మావోయిస్టులు
పాట్నా: మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సిమ్లుతల ఆవస్య విద్యాలయం (రెసిడేన్షియల్ పాఠశాల) విద్యార్థిని బీహార్‌లోని జుమాయి జిల్లాలో గురువారం ఉదయం విడుదల చేశారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు పాట్నాలో వెల్లడించారు. ఈ భవనం నుంచి వెంటనే పాఠశాలను ఖాళీ చేయాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని చెప్పారు. అలా చేయకుంటే పాఠశాలపై దాడి తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతనెలలో బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ నిర్వహించిన పరీక్షల్లో ఈ రెసిడేన్షియల్ పాఠశాలకు చెందిన దాదాపు 30 మంది విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపథ్యంలో పాఠశాలను వెంటనే ఖాళీ చేయాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో బుధవారం రాత్రి సాయుధలైన కొంత మంది మావోయిస్టులు పాఠశాల విద్యార్థిని కిడ్నాప్ చేశారు. -
బ్యాంకు అధికారులు కిడ్నాప్... రూ. 20 లక్షలు డిమాండ్
పాట్నా: బీహర్‌లో కిడ్నాపర్లు మరోసారి రెచ్చిపోయారు. జుమాయి జిల్లాలోని ఇద్దరు బ్యాంకు అధికారులను సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేశారని పోలీసు ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. వారిని విడుదల చేయాలంటే రూ. 20 లక్షలు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఆ అధికారులు ఇద్దరు కిడ్నాప్ అయ్యారని చెప్పారు. అయితే సదరు అధికారుల కుటుంబసభ్యులు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న ఆ ఇద్దరు అధికారులు రాజ్‌ల బ్రాంచ్ మేనేజర్ ఓమ్ ప్రకాశ్ పాశ్వాన్, రంజిత్ కుమార్‌లుగా గుర్తించినట్లు చెప్పారు. కిడ్నాప్ చేసింది మావోయిస్టులా లేక నేరస్థులా అనే విషయంపై దర్యాప్తు సాగుతుందని తెలిపారు. బ్యాంకులో విధులు ముంగించుకుని... ఇంటికి వెళ్తుండగా మోటర్ సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు వీరిద్దరిని అపహరించుకునిపోయారని ఇంటిలిజెన్స్ అధికారులు వెల్లడించారని చెప్పారు. సదరు అధికారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిటన్లు ఎస్పీ ఉపేంద్ర ప్రసాద్ సింగ్ తెలిపారు. -
బీహార్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు
బీహార్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. జాముయ్ జిల్లాలోని పరాశి గ్రామంలో సమీపంలో ఎస్టీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపన కాల్పుల్లో ఓ జవాను మరణించాడని ఆ జిల్లా ఎస్పీ జితేంద్ర రాణా శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. ఈ రోజు తెల్లవారుజామున జిల్లాలోని పరాశి గ్రామంలోని పీడబ్ల్యూడీ శాఖకు చెందిన భవనాన్ని సాయుధలైన మావోయిస్టులు పేల్చివేశారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ జవాన్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే మాటు వేసిన మావోయిస్టులు జవాన్లపై కాల్పులకు ఉపక్రమించారని జిల్లా ఎస్పీ వివరించారు. అయితే మరణించిన, గాయపడని జవాన్లు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని ఆయన తెలిపారు. అయితే పరాశి పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్‌ను జవాన్లు తీవ్రతరం చేశారు.


