నన్ను గెలికితే.. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ తప్పదు! | Jammalamadugu MLA Adinarayana Reddy Issues Operation Sindoor Warning, Coalition Rally Draws Lukewarm Response | Sakshi
Sakshi News home page

నన్ను గెలికితే.. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ తప్పదు!

Jun 18 2026 7:40 AM | Updated on Jun 18 2026 8:31 AM

adinarayana reddy fire on Ramasubbareddy

జమ్మలమడుగు: ‘‘నేను ఎవరి జోలికీ వెళ్లను, ఎవరినీ గెలకను.. కానీ నన్ను ఎవరైనా గెలికితే మాత్రం ‘ఆపరేషన్‌ సింధూర్‌’ చేపడతా’’ అంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ సి.ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర బెదిరింపులకు దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మలమడుగులో నిర్వహించిన ర్యాలీ అనంతరం పాత బస్టాండ్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సభ ప్రారంభం నుంచి ఎమ్మెల్యే ప్రసంగిస్తున్నంత సేపూ కింద ఉన్న కొందరు కార్యకర్తలు అరుస్తూ గోల చేస్తుండటంతో ఆదినారాయణరెడ్డి తీవ్ర అసహనానికి లోనయ్యారు. 

ఆవేశంతో..
కోపంతో ఊగిపోతూ.. ‘‘నేను మూడు రెండు వేసి అరుస్తాను.. నేను ఆరు వేసినా అరవకుండా ఉంటారా?’’ అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నివిధాలుగా అభివృద్ధి చేశామంటూ ప్రగల్భాలు పలికారు. నియోజకవర్గంలో చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని ఆయన మైకులో చెబుతుండగానే.. కింద ఉన్న ఒక చేనేత కార్మికుడు గట్టిగా స్పందిస్తూ, తనకు ఇంత వరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు రాలేదని అందరి ముందూ వాపోవడంతో సభలో కాసేపు నిశ్శబ్దం ఆవరించింది.

వైఎస్సార్‌సీపీ సభకు పోటీగా పెట్టినా.. వెలవెలబోయిన కూటమి సభ!
ఈ నెల 12వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన ’వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలివచ్చి సభను భారీగా విజయవంతం చేశారు. దానికి పోటీగా ఎలాగైనా సరే జమ్మలమడుగులో అంతకంటే పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి తామేంటో నిరూపించుకోవాలని కూటమి నేతలు ఆశపడ్డారు. అయితే, వైఎస్సార్‌సీపీ సభకు వచ్చిన జనంలో సగం మంది కూడా ఈ రోజు కూటమి సభకు రాలేదని, కేవలం నాలుగు నుంచి ఐదు వేల మంది మాత్రమే హాజరయ్యారని అక్కడికి వచ్చిన వారి సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకోవడం ఇక్కడ కొసమెరుపు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement