కాన్పూర్: ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన కవల సోదరులు మహరూఫ్ అహ్మద్ ఖాన్, మస్రూర్ అహ్మద్ ఖాన్ తమ అనుబంధంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అద్భుతమైన ర్యాంకులు సాధించినప్పటికీ వేర్వేరు ఐఐటీల్లో చేరకుండా కలిసి చదువుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు.
వైద్య దంపతుల కుమారులైన 18 ఏళ్ల మహరూఫ్, మస్రూర్‌లు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వరుసగా 32, 169 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు. మహరూఫ్‌కు ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చినప్పటికీ, తన సోదరుడు అదే కోర్సులో అక్కడ సీటు పొందకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. ఇద్దరికీ కంప్యూటర్ సైన్స్‌లో ప్రవేశం లభించిన ఐఐటీ కాన్పూర్‌లో కలిసి బీటెక్ చదవాలని నిర్ణయించారు.
ఐఐటీ కాన్పూర్ ఓరియంటేషన్ సందర్భంగా మహరూఫ్ మాట్లాడుతూ.. నా సోదరుడి కోసం ఐఐటీ బాంబేను వదులుకుని రావడంపై నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అతనికంటే నాకు ముఖ్యమైనది ఏదీ లేదు అని తెలిపాడు.
ఈ కవలలు జేఈఈ సన్నాహకానికి రాజస్థాన్‌లోని కోటాలో మూడేళ్లు కలిసి శిక్షణ పొందారు. జూలై 21న ఐఐటీ కాన్పూర్‌లో చేరిన వీరిద్దరూ, ఇకపై కూడా ఒకరికొకరు అండగా ఉంటూ చదువులో ముందుకు సాగాలని సంకల్పించారు. అన్న చేసిన ఈ త్యాగాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పటిలాగే ఒకరికొకరం తోడుగా ఉంటాం అని మస్రూర్ పేర్కొన్నాడు.
మొదట కళాశాల యాజమాన్యం వీరికి ఒకే హాస్టల్‌లో వేర్వేరు గదులు కేటాయించింది. అయితే అధికారులను కోరడంతో హాల్ ఆఫ్ రెసిడెన్స్–13లోని B103 గదిని ఇద్దరికీ కేటాయించారు.
వారి విజయంలో తల్లి డాక్టర్ జీనత్ బేగం కీలక పాత్ర పోషించారు. కుమారులు కోటాలో కోచింగ్ తీసుకునే సమయంలో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి వారితో కలిసి అక్కడే ఉండి చదువుకు పూర్తి సహకారం అందించారు. తండ్రి డాక్టర్ మన్సూర్ అహ్మద్ ఖాన్ ఉద్యోగరీత్యా ఒడిశాలోనే ఉంటూ తరచూ కుటుంబాన్ని సందర్శించేవారు.
తన కుమారులు ఒకే కాలేజీలో ఇప్పుడు ఒకే గదిలో కలిసి ఉండడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ జీనత్ బేగం తెలిపారు. ఇక చిన్నప్పటి నుంచే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనదని మహరూఫ్ గుర్తు చేసుకుంటూ..ఐదో తరగతిలో జ్వరంతో బాధపడుతున్న మస్రూర్ స్థానంలో తాను కరాటే ప్రదర్శనలో పాల్గొన్న సంఘటనను స్మరించుకున్నాడు.


