సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో డిజిటల్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం ‘టీ-ఫైబర్’ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు.
సచివాలయంలో మంగళవారం నిర్వహించిన 'టీ-ఫైబర్' ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాలు ప్రకటించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశం సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..నిర్దేశిత గడువులోగా (సెప్టెంబర్ 1) రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా ప్రైవేట్ ఇంటర్నెట్ ఆపరేటర్లను ఉపయోగిస్తే, వారికి ఎలాంటి ప్రభుత్వ బిల్లులు చెల్లించబోమని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం చలామణిలో ఉన్న టీ-స్వాన్ నెట్‌వర్క్‌ను రాబోయే నెల రోజుల్లోగా పూర్తిగా టీ-ఫైబర్ పరిధిలోకి బదిలీ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రభుత్వ శాఖల మధ్య సమాచార మార్పిడి మరింత వేగవంతం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఫ్యూచర్ సిటీ'కి కూడా పూర్తిస్థాయిలో నాణ్యమైన టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందేలా ఇప్పటి నుంచే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను నిర్దేశించారు. దీంతో పాటు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని చేరవేసే ఇంటింటికి ఇంటర్నెట్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, అనుకున్న లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని టీ-ఫైబర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


