17 లేదా 18న బయలుదేరనున్న సీఎం బృందం
పెట్టుబడులు ఆకర్షించేందుకు నాలుగు దేశాల్లో పర్యటన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 17 లేదా 18 అర్ధరాత్రి నుంచి సెపె్టంబరు 10 మధ్య నాలుగు దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాలుగు దేశాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో సీఎం బృందం పర్యటించనుంది. పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు కానున్నారు. ఫ్యూచర్‌సిటీలో పెట్టుబడులతోపాటు రాష్ట్రంలో విదేశీ యూనివర్సిటీలు, క్రీడలు, శిక్షణా సంస్థల భాగస్వామ్యంపై చర్చించనున్నారు. ఈనెల 16న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి 21ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం ఉండాలంటూ తీర్మానం చేసే అవకాశం ఉంది.
ఆ మరుసటి రోజు విదేశీ పర్యటనకు బయలుదేరే అవకాశముంది. హైదరాబాద్ నుంచి ముందుగా యూకేకు, అక్కడ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూతురు నిఖా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో మరిన్ని ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి ఆహా్వనించే ప్రయత్నాలు జరగనున్నాయి. యూకే, అమెరికాలోని ప్రముఖ క్రీడా అకాడమీలు, శిక్షణా కేంద్రాలను సందర్శించి అక్కడ అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి సలహాదారు కె.రామకృష్ణారావుతోపాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.


