సచిన్‌ అహీర్‌ పార్టీ మార్పుపై.. ఆదిత్యా ఠాక్రే ఆగ్రహం | aaditya thackerays right hand man sachin ahir joins eknath shinde faction | Sakshi
Sakshi News home page

సచిన్‌ అహీర్‌ పార్టీ మార్పుపై.. ఆదిత్యా ఠాక్రే ఆగ్రహం

Jun 30 2026 5:51 PM | Updated on Jun 30 2026 7:09 PM

aaditya thackerays right hand man sachin ahir joins eknath shinde faction

ముంబై: ప్రస్తుతం శివసేన (యూబీటీ)కి ఎదురుగాలి వీస్తుంది. ఇటీవలే ఆపార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు శిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ప్రకటించారు. తాజాగా ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ సచిన్ అహీర్ .. ఉద్ధవ్‌కు హ్యాండిచ్చి ఏక్‌నాథ్‌ శిందేతో చేతులు కలిపారు. అయితే దీనిపై ఆదిత్యా ఠాక్రే చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆ పార్టీ నేతలతో సచిన్‌ను తన వద్దకు పిలిపించండి అని అన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఠాక్రేలకు మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎదురుగాలి వీస్తుంది. ఎన్నో ఏళ్లుగా వారి కంచుకోటలా ఉన్న ముంబై పీఠం వారి చేయి జారిపోవడం.. ఇటీవల ఆపార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు షిండే వర్గంలో చేరడం.. తాజాగా ఆదిత్యా ఠాక్రేకు ఎంతో నమ్మిన బంటుగా ఉంటూ తన రైట్‌హ్యాండ్‌గా చలామణీ అవుతున్న సచిన్‌ అహిర్‌ సైతం పార్టీని వీడడంతో వారికి దెబ్బమీద దెబ్బ తగులుతుంది. ఈ విషయమై ఆదిత్యా ఠాక్రే పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఆదిత్యఠాక్రే ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "జీవితంలో కొన్ని సూత్రాలు ఉండాలి. పార్టీ మీకు అన్ని ఇచ్చినప్పుడు, కష్టకాలంలో పార్టీతోనే నిలబడాలి. ఆయన్ను నా ముందుకు తీసుకురండి, పార్టీ ఆయనకు ఏమి ఇవ్వలేదో నేనే అడుగుతాను" అంటూ ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రికా కథనాలు పేర్కొన్నాయి. అయినా ఉద్ధవ్ వర్గాన్ని వీడడం పార్టీకి మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆదిత్యాఠాక్రేకు తీరని దెబ్బని భావిస్తున్నారు.  

కాగా సచిన్ అహిర్ పార్టీలోకి వస్తూనే "సిక్స్ కొట్టారు" అని  ఏక్‌ నాథ్‌ శిండే ‍ప్రశంసించారు. "ఆయన క్షేత్రస్థాయి కార్యకర్త, ప్రజలు ఆయన రాజకీయ శైలిని ఇష్టపడతారు. ఆయన మా జట్టు ఆటగాడు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ ఆయనే చేస్తారు" అని షిండే సంతోషం వ్యక్తం చేశారు.మహాయుతి కూటమిలో డిప్యూటీ చైర్‌పర్సన్ పదవి కోసం నీలం గోర్హే, కృపాల్ తుమనే వంటి శివసేన నేతలు గట్టిగా ప్రయత్నించారు. కానీ శిండే శివసేన తరుపున సచిన్ అహిర్ మహారాష్ట్ర శాసనమండలి  డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు

కాగా 2019లో ఆదిత్య ఠాక్రే తన మొదటి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, అప్పటివరకు ఎన్‌సీపీలో ఉన్న అహిర్‌ను శివసేనలోకి తీసుకొచ్చి వర్లీ ఎన్నికల పూర్తి బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన షిండే వర్గంలో చేరడం శివసేన ఉద్ధవ్‌ వర్గంలో తీవ్ర కలకలం రేపుతుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement