breaking news
Sachin Ahir
-
తెలుగు ఓటు ఎటువైపు?
సాక్షి ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామం వర్లీ నియోజకవర్గంలో కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. శివసేన (యూబీటీ)కు చెందిన ఎమ్మెల్సీ, వర్లీ ప్రాంత సీనియర్ నాయకుడు సచిన్ అహిర్ ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేనలో చేరడంతో వర్లిలోని తెలుగు ఓటర్ల రాజకీయ వైఖరి ఎలా ఉండబోతుందనే అంశం వర్లీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రేకు అండగా నిలిచిన తెలుగు ఓటు బ్యాంకు ఇప్పుడు ఏ దిశగా పయనిస్తుందన్న దానిపై ముఖ్యంగా స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.వర్లి నియోజకవర్గంలో వర్లి నాకా, పద్మశాలీ చౌక్, బీడీడీ చాల్స్ 108 బిల్డింగ్‌తో పాటు పలు చుట్టు పక్కల ప్రాంతాల్లో వేలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడిన తెలుగు కుటుంబాలు స్థానిక రాజకీయాల్లో కూడా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల సమయంలో తెలుగు ఓటు కీలకంగా మారడం వర్లి రాజకీయాల్లో సర్వసాధారణం. సచిన్ అహిర్ ఏ పార్టీలో ఉన్నా తెలుగు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలుగు సంఘాల కార్యక్రమాలు, సామాజిక వేడుకలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా పాల్గొనడంతో ఆయనకు తెలుగు ప్రజల్లో వ్యక్తిగతంగా మంచి ఆదరణ ఏర్పడింది. అందుకే రాజకీయ పార్టీ కంటే సచిన్ అహిర్ వ్యక్తిత్వానికే ప్రాధాన్యం ఇచ్చే తెలుగు ఓటర్లు కూడా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఇదే సమయంలో శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ సునీల్ శిందే కూడా వర్లి తెలుగు ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. తెలుగు సంఘాలు నిర్వహించే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, స్థానికులతో నిరంతరం మమేకమవుతూ ఆయన కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు ప్రజల సమస్యలపై స్పందించే నాయకుడిగా ఆయనకు కూడా మంచి ఆదరణ ఉందని స్థానిక రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రే విజయంలో సచిన్ అహిర్, సునీల్ షిందే ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా తెలుగు ఓటర్లను సమీకరించి ఆదిత్య ఠాక్రేకు అనుకూలంగా మద్దతు కూడగట్టడంలో ఈ ఇద్దరు నాయకుల పాత్ర ముఖ్యమైందని అప్పట్లో రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. సచిన్ అహిర్ శిందే శివసేనలో చేరగా, సునీల్ షిందే మాత్రం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లోనే కొనసాగుతున్నారు. దీంతో రాబోయే భవిష్యత్ ఎన్నికల్లో తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు ఇరు వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.దుకాణాలు, రోడ్లు చర్చావేదికలుగా.. ప్రస్తుతం వర్లిలో తెలుగు ప్రజలు వివిధ రాజకీయ పార్టీలకు మద్దతుగా ఉన్నారు. కొందరు ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు, మరికొందరు శిందే శివసేనకు, బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) తదితర పార్టీలకు అనుకూలంగా ఉన్నారు. అయినప్పటికీ, వ్యక్తిగతంగా సచిన్ అహిర్‌కు మద్దతుగా ఉండే తెలుగు ఓటర్ల సంఖ్య అలాగే సునీల్ శిందే మద్దతుగా ఉండే తెలుగు ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉందని స్థానికులు చెబుతున్నారు.మంగళవారం సాయంత్రం వర్షం కురుస్తున్నప్పటికీ వర్లి నాకా, పద్మశాలి చౌక్, 108 బిల్డింగ్ చుట్టూ ఉన్న పలు తెలుగు సంఘాల భవనాల్లో దుకాణాలలో రోడ్లపై తెలుగు ప్రజలు ఈ రాజకీయ పరిణామంపై చర్చించుకుంటూ కనిపించారు. ‘ఇకపై తెలుగు ఓటు ఎటువైపు?‘, ‘సచిన్ అహిర్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది?‘, ‘సునీల్ శిందే మద్దతుతో యూబీటీ తన పట్టు నిలబెట్టుకోగలదా?‘ వంటి అంశాలు ప్రధాన చర్చగా మారాయి.చదవండి: ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్రయాణికులు ఫైర్రాబోయే రోజుల్లో సచిన్ అహిర్ శిందే శివసేన తరఫున ప్రచారం నిర్వహించే అవకాశం ఉండగా, సునీల్ శిందే ఉద్ధవ్ ఠాక్రే శివసేన తరఫున ప్రచార బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్లి తెలుగు ఓటర్లపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే తెలుగు ఓటర్లు రెండు వర్గాలుగా చీలుతారా? లేక అభ్యర్థులు, స్థానిక పరిస్థితులు, ఎన్నికల నాటికి ఏర్పడే రాజకీయ సమీకరణాల ఆధారంగా ఒకే వైపు మొగ్గు చూపుతారా? అన్నది ప్రస్తుతం రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. దీనిపై స్పష్టత రావాలంటే రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు, స్థానిక నాయకుల వైఖరి, ఎన్నికల ప్రచార సరళిని వేచి చూడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సచిన్ అహీర్ పార్టీ మార్పుపై.. ఆదిత్యా ఠాక్రే ఆగ్రహం
ముంబై: ప్రస్తుతం శివసేన (యూబీటీ)కి ఎదురుగాలి వీస్తుంది. ఇటీవలే ఆపార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు శిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ప్రకటించారు. తాజాగా ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ సచిన్ అహీర్ .. ఉద్ధవ్‌కు హ్యాండిచ్చి ఏక్నాథ్ శిందేతో చేతులు కలిపారు. అయితే దీనిపై ఆదిత్యా ఠాక్రే చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆ పార్టీ నేతలతో సచిన్‌ను తన వద్దకు పిలిపించండి అని అన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఠాక్రేలకు మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎదురుగాలి వీస్తుంది. ఎన్నో ఏళ్లుగా వారి కంచుకోటలా ఉన్న ముంబై పీఠం వారి చేయి జారిపోవడం.. ఇటీవల ఆపార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు షిండే వర్గంలో చేరడం.. తాజాగా ఆదిత్యా ఠాక్రేకు ఎంతో నమ్మిన బంటుగా ఉంటూ తన రైట్‌హ్యాండ్‌గా చలామణీ అవుతున్న సచిన్ అహిర్ సైతం పార్టీని వీడడంతో వారికి దెబ్బమీద దెబ్బ తగులుతుంది. ఈ విషయమై ఆదిత్యా ఠాక్రే పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.ఆదిత్యఠాక్రే ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "జీవితంలో కొన్ని సూత్రాలు ఉండాలి. పార్టీ మీకు అన్ని ఇచ్చినప్పుడు, కష్టకాలంలో పార్టీతోనే నిలబడాలి. ఆయన్ను నా ముందుకు తీసుకురండి, పార్టీ ఆయనకు ఏమి ఇవ్వలేదో నేనే అడుగుతాను" అంటూ ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రికా కథనాలు పేర్కొన్నాయి. అయినా ఉద్ధవ్ వర్గాన్ని వీడడం పార్టీకి మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆదిత్యాఠాక్రేకు తీరని దెబ్బని భావిస్తున్నారు. కాగా సచిన్ అహిర్ పార్టీలోకి వస్తూనే "సిక్స్ కొట్టారు" అని ఏక్ నాథ్ శిండే ప్రశంసించారు. "ఆయన క్షేత్రస్థాయి కార్యకర్త, ప్రజలు ఆయన రాజకీయ శైలిని ఇష్టపడతారు. ఆయన మా జట్టు ఆటగాడు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ ఆయనే చేస్తారు" అని షిండే సంతోషం వ్యక్తం చేశారు.మహాయుతి కూటమిలో డిప్యూటీ చైర్పర్సన్ పదవి కోసం నీలం గోర్హే, కృపాల్ తుమనే వంటి శివసేన నేతలు గట్టిగా ప్రయత్నించారు. కానీ శిండే శివసేన తరుపున సచిన్ అహిర్ మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారుకాగా 2019లో ఆదిత్య ఠాక్రే తన మొదటి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, అప్పటివరకు ఎన్సీపీలో ఉన్న అహిర్‌ను శివసేనలోకి తీసుకొచ్చి వర్లీ ఎన్నికల పూర్తి బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన షిండే వర్గంలో చేరడం శివసేన ఉద్ధవ్ వర్గంలో తీవ్ర కలకలం రేపుతుంది. -
ముంబై ఎన్సీపీ అధ్యక్షుడిగా సచిన్ అహిర్
♦ వెల్లడించిన రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునిల్ తట్కరే ♦ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నవాబ్ మలిక్ నియామకం ♦ బీఎంసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న అహిర్ సాక్షి, ముంబై : బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న తరుణంలో ఎన్సీపీ ముంబై అధ్యక్షునిగా మాజీ మంత్రి సచిన్ అహిర్‌ను ఎంపిక చేసింది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుని పదవితోపాటు ముఖ్య అధికార ప్రతినిధిగా, ముంబై యూనిట్ ఇన్చార్జిగా నవాబ్ మలిక్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునిల్ తట్కరే ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వీరితోపాటు జిల్లాలవారి అధ్యక్షులను కూడా ప్రకటించారు. ముంబై ఎన్సీపీ అధ్యక్షుని రేసులో సచిన్ అహిర్తోపాటు కిరణ్ పావస్కర్, నవాబ్ మలిక్, సంజయ్ దీనా పాటిల్‌ల పేర్లను చర్చించారు. కాగా ఎన్సీపీ అహిర్‌ను ముంబై అధ్యక్షునిగా ఎంపిక చేసింది. గతంలో సచిన్ అహిర్ గృహనిర్మాణ శాఖ సహాయక మంత్రులుగా, ముంబైలో ఉట్టి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరపపి తనదైన ముద్రవేసుకున్నారు. మిల్లు కార్మికుల సమస్యలపై ‘రాష్ట్రీయ మిల్ మజ్దూర్ యూనియన్‌లో విధులు నిర్వహించారు. మరోవైపు ‘ఇంటక్ కామ్‌గార్ యూనియన్’ అధ్యక్షుని పదవి కూడా చేపట్టారు. స్వతంత్రంగా పోటీ చేస్తాం : అహిర్ రాబోయే ఎన్నికల్లో పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని అహిర్ తెలిపారు. గత పదిహేనేళ్లుగా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడం వల్ల తమ పార్టీ ప్రజల్లో గుర్తింపు పొందలేకపోయిందన్నారు. ఓటు బ్యాంకును పెంపొందించకోలేక పోయామన్నారు. బూత్ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి మొత్తం 227 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. దహీహందీ, నవరాత్రి, గణేశ్ ఉత్సవాలు, పండుగల సమయంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై మందిరాల ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు. దహీ హందీ విషయమై గతంలో కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని, అప్పుడు కోర్టు స్టే ఇచ్చిందన్నారు. పండుగలకు అంతరాయం కలిగించకూడదనీ, పండుగలు నగరాలు ఏర్పడకముందే మొదలయ్యాయని చెప్పారు. ముంబై ఎన్సీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీని త్వరలో వెల్లడిస్తామని తట్కరే అన్నారు. 100 మందిని బలిగొన్న కల్తీసారా కేసు, రైతుల సమస్యలు, బీజేపీ మంత్రులపై అవినీతి ఆరోపణలను త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని ఆయన అన్నారు. -
‘ఉట్టి’ దిగులు..!
సాక్షి, ముంబై: కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. అన్న సామెత చందంగా ఉంది ప్రస్తుతం నగర పోలీసుల పరిస్థితి.. ఉట్టి ఉత్సవాల్లో 12 ఏళ్ల లోపు పిల్లలు పాల్గొన కుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని బాలల హక్కుల కమిషన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా పిల్లలు లేకుం డా ఉత్సవమా.. సమస్యే లేదు.. ఉట్టి ఉత్సవాల్లో పిల్లలు తప్పకుండా పాల్గొం టారని ఉత్సవ మండళ్లు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పోలీసుల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా తయారైంది. ఈ నెల 17వ తేదీన (ఆదివారం) ఉట్టి ఉత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ ఉత్సవాల్లో పిల్లలు పాల్గొనే అంశం ఎటూ తేలకపోవడంతో మధ్యలో నగర పోలీసులు నలిగి పోతున్నారు. ఉత్సవాల్లో 12 ఏళ్లలోపు పిల్లలు పాల్గొంటే సంబంధిత ఉట్టి ఉత్స వ మండళ్లపై చర్యలు తీసుకునే బాధ్యత పోలీసులదేనని బాలల హక్కుల సంఘం ఆదేశించింది. మరోపక్క పిల్లలతోనే ఉట్టి ఉత్సవాలు నిర్వహిస్తామని మండళ్లు సవాలు చేస్తున్నాయి. మండళ్ల వైఖరిపై పోలీసులు ఏ విధంగా స్పం దిస్తారనేదానిపై అందరి ధృష్టి పడింది. ఉట్టి ఉత్సవాల్లో 12 ఏళ్లలోపు పిల్లలు పాల్గొనడంవల్ల వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఉట్టి పగులగొట్టే ప్రయత్నంలో అదుపుతప్పి పైనుంచి కిందపడడంవల్ల వారు వికలాంగులయ్యే ప్రమాదముంది. గతంలో జరిగిన ఘటనల్లో కొందరు వికలాంగులుగా మారారు. కొం దరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. తాజాగా వారం కిందట నవీముంబైలోని సాన్‌పాడా ప్రాంతంలో ఉట్టిఉత్సవాలకు సాధన చేస్తుండగా కిరణ్ తల్కరే (14) అనే బాలుడు పైనుంచి కిందపడడంతో తలకు, చాతిలో గాయాలయ్యాయి. నేరుల్‌లోని సహ్యాద్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రెండు రోజులకు చనిపోయాడు. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని పిల్లలు ఉట్టి ఉత్పవాల్లో పాల్గొనడాన్ని బాలల హక్కుల సంఘం నిషేధించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వాన్ని కోరింది. అంతేగాక అలాంటి మండళ్లపై చర్యలు తీసుకునే బాధ్యత పోలీసులదేనని తేల్చిచెప్పిం ది. అయితే పిల్లలతోనే ఉట్టి ఉత్సవాలు నిర్వహిస్తామని నగరం, ఠాణే జిల్లాకు చెందిన సార్వజనిక ఉట్టి ఉత్సవ మండళ్లు ప్రభుత్వానికి, బాలల హక్కుల సంఘానికి సవాలు విసిరాయి. అందుకు మహిళ గోవిందాందాలు కూడా మద్దతు పలికాయి. దీంతో ఏం చేయాలో తెలియక మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారు. ఇదిలాఉండగా ఈ సమస్యపై త్వరలో పరిష్కారం కనుగొంటామని మహారాష్ట్ర రాష్ట్ర బాలల హక్కు ల సంరక్షణ కమిషన్ అధ్యక్షుడు ఉజ్వల్ ఉకే అన్నారు. గృహనిర్మాణ శాఖ సహా య మంత్రి సచిన్ అహిర్ సైతం ఈ వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని వా రం కిందట ప్రకటించారు. కాని ఇంతవరకు సమస్య ఓ కొలిక్కిరాకపోవడంతో ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారనేది ఉత్కంఠగా మారింది. -
ఇళ్లు ఇస్తాం.. ఆందోళన వద్దు
సాక్షి, ముంబై: మిల్లు కార్మికులందరికీ తప్పక ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హామీ ఇచ్చారు. ఈ విషయమై కార్మికులుగాని, వారి వారసులుగాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వర్లీలోని సెంచురీ మిల్లు స్థలంలో కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రాజెక్ట్‌కు శనివారం సాయంత్రం సీఎం చవాన్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి చవాన్‌తోపాటు కేంద్ర సహాయ మంత్రి మిలింద్ దేవరా, ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్, గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ ఆహిర్, దత్తా ఇస్వాల్కర్, ప్రవీణ్ ఘాగ్, జయశ్రీ ఖాడిల్కర్, గన్నారపు శంకర్ తదితరులు హాజరయ్యారు. తొలుత సెంచురీ మిల్లులో భూమి పూజ చేశారు. అనంతరం జాంబోరి మైదానంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చవాన్ కార్మికులనుద్ధేశించి మాట్లాడుతూ రాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) ఆధీనంలోకి వచ్చిన 16 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. తొలి విడతలో కాలాచౌకి, ప్రభాదేవి ప్రాంతాల్లో నిర్మించిన 6,925 ఇళ్లను 2012 జూన్‌లో లాటరీ ద్వారా అర్హులకు అందజేశామని గుర్తు చేశారు. సెంచురీ మిల్లు స్థలాల్లో నిర్మించే ఇళ్లతోపాటు మాడా, ఎమ్మెమ్మార్డీయే ప్రస్తుతం నిర్మిస్తున్న, భవిష్యత్‌లో నిర్మించబోయే వాటిలో కూడా మిల్లు కార్మికులకు ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్మికులు ఆందోళ న చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం సెంచురీ మిల్లులో తొలి విడతలో 1,430 ఇళ్లు నిర్మించనున్నారు. అందులో 651 ఇళ్లు మాడా ట్రాన్సిట్ క్యాంపులకు వినియోగించుకుంటుందని చవాన్ తెలిపారు. రూబీ మిల్లులో నిర్మిం చనున్న 23 ఇళ్లలో ఎనిమిది ట్రాన్సిట్ క్యాంపులు, పశ్చిమ మిల్లులో 250 ఇళ్లకు 124 ట్రాన్సిట్ క్యాం పులు, ప్రకాశ్ కాటన్ మిల్లో నిర్మించనున్న 562 ఇళ్లల్లో 281 ట్రాన్సిట్ క్యాంపులు, భారత్ మిల్లోని 188 ఇళ్లలో 93, జూబిలీ మిల్లోని 157 ఇళ్లలో 78 ట్రాన్సిట్ క్యాంపులకు కేటాయిస్తున్నామని సీఎం చవాన్ వివరించారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రసంగం కొనసాగుతుండగానే 1.42 లక్షల కార్మికులకి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కొంతమంది పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు 150 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని కరీరోడ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరిని రాత్రి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మా వాళ్లు కాదు
ముంబై: గత వారం 23 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై అత్యాచారం చేసిన నిందితుల్లో కొందరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందినవారని వచ్చిన ఆరోపణలని ఆ పార్టీ నాయకుడు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్ కొట్టిపారేశారు. తనతో నిందితులు ఉన్నట్టుగా చూపే ఫొటోని ప్రచురించిన హిందీ డైలీ దూపర్ కా సామ్నాతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సామూహిక అత్యాచారం కేసులో నిందితుల ఫొటోలను ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా విడుదల చేయలేదని ఆయన మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ విషయమై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (క్రైమ్) హిమాన్షు రాయ్‌తో మాట్లాడానని అన్నారు. పత్రికలో ప్రచురించిన ఫొటోలో తనతో ఉన్న వారికి, నిందితుల ముఖాలకు పొంతన కుదరడం లేదని ఆయన చెప్పారన్నారు. ఏమీ చూసుకోకుండానే ఫొటోను సోమవారం సర్క్యూలేట్ చేసిన ఉపాధ్యాయ్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ‘దూపర్ కా సామ్నా పత్రికలో ప్రచురితమైన ఓ ఫొటోలో ముగ్గురు వ్యక్తుల ముఖాలను సర్కిల్ చేసి వీరు గ్యాంగ్ రేప్ నిందితులని పేర్కొంది. వారు సచిన్ అహీర్‌తో కరచాలనం చేస్తున్నట్టుగా ఉంది. 2010 సంవత్సరంలో ఓ ఈద్ కార్యక్రమంలో ఈ ఫొటో తీసినట్టు సేన పబ్లికేషన్ పేర్కొంది. ఈ సంస్థపై కూడా పరువు నష్టం దావా వేస్తాన’ని తెలిపారు. కొంత మంది రేపిస్టులు తనకు దగ్గరివాళ్లని, తన పార్టీ నిరాధారమైందని చేసిన ఆరోపణలను ఖండించారు. నిరాధారమైన కథనంతో వారి మానసిక స్థాయి ఎలా ఉందో ఊహించుకోవచ్చన్నారు. ఇంతటి హేయమైన చర్యకు బీజేపీ చేస్తుందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. కొంత మంది బీజేపీ నాయకుల వ్యక్తిగత సహాయకులు పార్టీని నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ్ వల్ల ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చిందన్నారు. అయితే పార్టీ నాయకులతో మాట్లాడి ఉపాధ్యాయ్‌పై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీ అన్నారు. కఠిన చట్టాలు తీసుకురావాలి: నటి కాజోల్ ముంబై: అత్యాచారాలు చేసే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చట్టాల్లో మార్పులు తీసుకరావాలని బాలీవుడ్ నటి కాజోల్ మంగళవారం డిమాండ్ చేశారు. ‘మహిళా ఫోటో జర్నలిస్ట్‌పై జరిగిన అత్యాచారాన్ని చెప్పేందుకు ఎలాంటి మాటలు రావడం లేదు. అదో భయంకర సంఘటన. ఇది హత్య కన్నా ఏ మాత్రం తక్కువ కాద’ని అన్నారు. దీని గురించి మనం ఎంతో కొంత చేయాల్సి అవసరముందని చెప్పారు. కఠిన చట్టాలను ప్రభుత్వం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ‘ప్రజల్లో భయం కలిగించే రీతిలో శిక్షలో మార్పు తీసుకరావాలి. ఆ మేరకు చట్టాలకు రూపకల్పన చేయాలి. దీనిని సర్కార్‌ను పట్టించుకోనంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయ’ని ఆమె చెప్పారు.


