సాక్షి, ఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు హైకోర్టు విచారణను కొనసాగించవద్దని అలహాబాద్ కోర్టుకు.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. సీబీఐ, ఈడీలు హైకోర్టుకు ఎలాంటి నివేదిక సమర్పించరాదని తెలిపింది. ఈ కేసును విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రాహుల్ గాంధీపై నమోదైన పిటిషన్‌ను విచారించిన అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం, ఈ ఆరోపణలపై సీబీఐ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు జరపాలని ఆదేశించింది. దర్యాప్తు పురోగతికి సంబంధించి నివేదికలు సమర్పించాలని, ఈడీ కూడా తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.
తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు అంత తీవ్రమైనవి అయితే మీ ఏజెన్సీలు ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉన్నాయని ధర్మాసనం నిలదీసింది. "కోర్టు నుంచి ఆదేశాలు రావాల్సిందేనా? మీ అంతట మీరుగా సుమోటోగా ఎలాంటి చర్యలు తీసుకోలేదా?" అని జస్టిస్ బాగ్చి దర్యాప్తు అధికారులను ప్రశ్నించారు.
కోర్టులో ఇరు పక్షాల వాదనలు.. రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ విఘ్నేష్ శిశిర్‌కు ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని ప్రశ్నించారు. ఇది చట్టబద్ధత లేని, పూర్తిగా కక్షసాధింపు చర్య అని, పిటిషనర్ పదేపదే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. సీబీఐ కేవలం ఫిర్యాదును ధృవీకరించడం మించి ఏమీ చేయలేదని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) ఎస్.వి. రాజు వాదిస్తూ.. ఇప్పటివరకు ఈ కేసులో తమ పాత్రేమీ లేదని, ఒకవేళ ఫిర్యాదులో గమనించదగ్గ నేరాలు ఉన్నట్లు తేలితే అది చాలా తీవ్రమైన విషయమవుతుందని తెలిపారు.
కాగా, రాహుల్ గాంధీపై వచ్చిన అక్రమాస్తుల ఆరోపణలను ధృవీకరించాలని సీబీఐ, ఈడీలను ఆదేశిస్తూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ జూలై 20న ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. సీబీఐ సమర్పించిన అఫిడవిట్‌లపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, దీనిపై వ్యక్తిగతంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతానికి ఆయనకు ఊరట లభించింది.


