సాక్షి, ఢిల్లీ: పీఎం కేర్ ఫండ్ వివరాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పీఎం కేర్ ఫండ్స్‌లో ప్రస్తుతం రూ. 8,452 కోట్లు ఉన్నట్లు ప్రకటించింది. ఆ నిధులన్నీ FDల రూపంలో ఉన్నాయని తెలిపింది.ఇప్పుడు కరోనా లేనందున ఖర్చులు దాదాపు ఆగిపోయాయి. కేవలం కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సహాయం కోసం మాత్రమే కొద్దిగా ఖర్చు చేస్తున్నారు.
కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం మార్చి 27, 2020న ప్రత్యేకంగా 'పీఎం కేర్స్ ఫండ్' పేరుతో పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. కరోనా వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మరియు బాధితులకు సహాయం అందించేందుకు ఈ నిధిని సృష్టించారు. దీని ద్వారా కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరుమీద బ్యాంకులో ప్రత్యేకంగా రూ. 10 లక్షల కార్పస్ ఫండ్ డిపాజిట్ చేస్తారు.
18 ఏళ్లు నిండిన తర్వాత వారికి రూ. 10 లక్షల నుండి ప్రతి నెలా కొంత చొప్పున స్టైపెండ్ (నెలవారీ ఖర్చులు) ఇస్తారు. 23 ఏళ్లు నిండిన తర్వాత మొత్తం రూ. 10 లక్షల సొమ్మును ఒకేసారి వారి చేతికి అందిస్తారు. అర్హులైన అనాథ పిల్లలను గుర్తించి, వారి పేరు మీద కేంద్ర ప్రభుత్వమే ఈ రూ. 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లను/పాస్‌బుక్‌లను అందజేస్తుంది.


