సాక్షి, ఢిల్లీ: ఇటీవల కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ జాతీయగేయం వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారంటూ వివాదం చెలరేగింది. తాజాగా దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. తాము పాడిన వందేమాతరం గతంలో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాడినదేనని ఆయన స్పష్టం చేశారు. అది నేరమైతే మహాత్మా గాంధీ, నెహ్రూలపైనా కేసులు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఖర్గే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వందేమాతరం ఆలాపన జరిగింది. అయితే గాయకులు వందేమాతరంలోని పూర్తి వెర్షన్‌ను ఆలపిస్తుండగా సోనియా గాంధీ ఖర్గే వైపు సైగ చేసి, అనంతరం గాయకులకు కూడా ఏదో చెప్పినట్లు కనిపించిందని బీజేపీ ఆరోపించింది. ఆమె వందేమాతరం పూర్తి ఆలాపనను ఆపించేందుకు ప్రయత్నించారని బీజేపీ నేతలు విమర్శించారు.
అయితే కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది. ఖర్గే చాలాసేపు నిల్చోవడంతో ఆయనకు కుర్చీ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్వాహకులకు సైగ చేశారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తెలిపారు. వందేమాతరం గీతాన్ని ఆపాలని ఆమె ఎలాంటి సూచన చేయలేదని స్పష్టం చేశారు. ఖర్గే ఆరోగ్యం బాగోలేదని, ఎక్కువసేపు నిల్చోలేరని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై సోమవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. వందేమాతరం గీతాలాపనను అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారంటూ వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదుదారు కోరారు. తాజాగా దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు.
ఖర్గే మాట్లాడుతూ.. ‘‘మేము పాడిన వందేమాతరం మహాత్మా గాంధీ పాడినదే. జవహర్‌లాల్ నెహ్రూ పాడినదే. గత 18 ఏళ్లుగా మేము అదే వందేమాతరాన్ని పాడుతున్నాం. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనూ ఇదే పాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లపాటు ఇదే వందేమాతరం పాడారు’’ అని అన్నారు.
‘‘మేము చేసినదే నేరమైతే.. గత 18 ఏళ్లుగా ఇదే నేరం జరుగుతున్నట్లే. అదే నేరమైతే మహాత్మా గాంధీపై కేసు పెట్టండి. నెహ్రూపైనా కేసు పెట్టండి’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. జాతీయ గీతాలు, జాతీయ గీతాలాపనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాల క్రితమే తీర్మానం చేసిందని, ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వారిలో చాలామంది పుట్టకముందే కాంగ్రెస్ ఈ అంశంపై నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, వందేమాతరం వివాదం మరింత ముదిరింది. సోమవారం గోవాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో ఖర్గే స్వయంగా వందేమాతరాన్ని ఆలపించారు. అయితే ఈసారి గీతంలోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడారు. గోవా కాంగ్రెస్ సదస్సు ప్రారంభానికి ముందు ఖర్గేతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు వందేమాతరం ఆలపించారు.
మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వందేమాతరం గీతాన్ని పూర్తి రూపంలో బహిరంగ సమావేశాలు, పాఠశాలలు, అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలు తదితర సందర్భాల్లో ఆలపించడాన్ని తప్పనిసరి చేసింది. అంతేకాకుండా వందేమాతరం ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, అంతరాయం కలిగించడం లేదా నిలిపివేయడం నేరంగా పరిగణించేలా పార్లమెంట్‌లో బిల్లును కూడా ఆమోదించింది.
దీంతో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వందేమాతరం ఆలాపనపై బీజేపీ చేసిన ఆరోపణలు, సోనియా గాంధీపై వచ్చిన ఫిర్యాదు, కాంగ్రెస్ ఇచ్చిన వివరణలతో ఈ అంశం రాజకీయంగా మరింత వివాదాస్పదంగా మారింది


