మార్కాపురం జిల్లా: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో నిత్యం ఏదో ఒక చోట ప్రయాణికులతో బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల పొదిలిలో గొడవ జరిగి డ్రైవర్ బస్సు దిగి వెళ్లిన ఘటనను మరవకముందే శనివారం కంభం నుంచి అర్థవీడు లోయకు వెళ్లే బస్సులోనూ అదే విధంగా జరిగింది. బస్టాండులోనే నిండిపోయిన బస్సు.. అక్కడి నుంచి కందులాపురం సెంటర్‌కు వెళ్లగా ప్రయాణికులు వేచి ఉన్నారు.
అదే చివరి బస్సు కావడంతో అక్కడున్న వారంతా అదే బస్సులో ఎక్కారు. బస్సులో కండక్టర్ కూడా ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పాటు డోర్ వద్ద వేలాడుతూ ప్రయాణికులు ఉండిపోయారు. దీంతో కొంచెం ముందుకు వెళ్లిన డ్రైవర్. బస్సు ఆపేసి కిందకు దిగిపోయాడు. ఇలాగైతే బస్సు నడపలేనని తేల్చి చెప్పాడు. పాపినేనిపల్లి రూటు కొండ ప్రాంతం మీదుగా వెళ్లాల్సి రావడం, ముందు వెళ్లే వాహనాల వారు సైడు ఇవ్వరని, అలాంటప్పుడు బస్సు ఎలా నడపాలని, పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
బస్సులు లేకుంటే తాము ఊర్లకు ఎలా వెళ్లాలని, ఇదే ఆఖరి బస్సు కావడంతో తప్పనిసరి పరిస్థితిలో ఎక్కాల్సి వచ్చిందని ప్రయాణికులు సైతం ఆర్టీసీ సిబ్బందితో వాదనకు దిగారు. కొంతసేపటి వరకు బస్సును అక్కడే నిలిపివేసిన డ్రైవర్.. అనంతరం కొందరు ప్రయాణికులు, స్థానికులు సర్దిచెప్పడంతో చేసేదేమీ లేక బయలుదేరాడు. కాగా, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత ఎక్కువ మంది మహిళలు బస్సులెక్కడం వలనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని పలువురు ప్రయాణికులు చెప్పుకొచ్చారు.


