మచిలీపట్నంటౌన్: వియత్నాం దేశంలోని ఫు క్వాక్ సముద్ర తీరంలో శనివారం ఉదయం జరిగిన ఘోర పర్యాటక బోటు ప్రమాదంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గెల్లి కిషోర్ భార్య మరణించింది. కిషోర్ ప్రాణాపాయ స్థితిలో ఉండగా, ఆయనకు సీపీఆర్ చేయడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మచిలీపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది. లావా సెల్ కంపెనీ తమ వ్యాపార భాగస్వాములు, డీలర్లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన విదేశీ పర్యటనలో భాగంగా గెల్లి దంపతులు వియత్నాం టూర్‌కు వెళ్లారు.
మూడు రోజుల క్రితం ఈ టూర్‌కు వెళ్లారు. వీరు శనివారం వియత్నాంలోని ఫు క్వాక్ ప్రాంతంలో ఆన్ థోయ్ ద్వీప సమూహం సమీపంలోని హోన్ మే రుట్ వద్ద పర్యాటకులతో కలసి స్పీడ్‌బోట్‌లో విహారయాత్రకు బయలుదేరారు. సముద్రంలో ఒక్కసారిగా వాతావరణం మారడంతో బలమైన గాలులు, ఎత్తైన కెరటాల ధాటికి బోటు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో ఉన్న పలువురు నీటిలో చిక్కుకోగా, సహాయక బృందాలు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన యాత్రికులు సహా మొత్తం 32 మంది మృతి చెందినట్లు వియత్నాం ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది.
మృతుల్లో మచిలీపట్నానికి చెందిన గెల్లి జయశ్రీ ఉన్నారు. స్ధానిక సర్కిల్‌పేటలోని కంచి కామాక్షమ్మ ఆలయ సమీపంలో సాయిబాబా గుడి పక్కన నివాసముండే గెల్లి కిషోర్ భార్య జయశ్రీ మృతితో గెల్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే స్థానిక వ్యాపార వర్గాలు దిగ్భ్రాంతి చెందాయి. గెల్లి కిషోర్ మచిలీపట్నంలో కిళ్లీ సామగ్రి దుకాణంతో పాటు లావా, టాటా ఇండికాం, టాటా సెల్యులర్ డీలర్‌గా గత 30 సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తున్నారు.
కలెక్టర్‌ను సంప్రదించిన కిషోర్ కుమారుడు ఆకాష్
వియత్నాంలో పడవ ప్రమాదంలో మృతి చెందిన తన తల్లి జయశ్రీ మృతదేహంతో పాటు ప్రాణాపాయం నుంచి బయటపడ్డ తండ్రి కిషోర్‌ను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆకాష్ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కోరారు. కృష్ణాజిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ కూడా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయటంతో స్పందించిన కలెక్టర్ ఎంబసీ అధికారులతో మాట్లాడి జయశ్రీ మృతదేహం త్వరితగతిన మచిలీపట్నంకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషాద ఘటనపై మచిలీపట్నంలోని ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.


