ఆంధ్రుల హక్కుకు 'ఉరి' | Employment and labor unions are angry at the government stance | Sakshi
Sakshi News home page

ఆంధ్రుల హక్కుకు 'ఉరి'

Jul 12 2026 5:33 AM | Updated on Jul 12 2026 5:33 AM

Employment and labor unions are angry at the government stance

విశాఖ ఉక్కుకు చంద్రబాబు సర్కార్‌ వెన్నుపోటు  

రాజధాని నిర్మాణాల్లో విశాఖ ఉక్కుకు దక్కని దన్ను 

సొంత ప్లాంట్‌ను కాదని సింహాద్రి స్టీల్‌ కొనుగోలు 

మరోసారి ప్రైవేటుపై ప్రభుత్వ ప్రేమ బట్టబయలు 

భారీ ముడుపులే దీనికి కారణమని విమర్శలు 

ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆగ్రహం

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కును కాపాడతామని పదేపదే హామీలు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తెర వెనుక కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారని ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణ పనుల కోసం విశాఖ ఉక్కుని ప్రాధాన్యతగా తీసుకోకుండా, ప్రైవేట్‌ సంస్థ అయిన ‘సింహాద్రి టీఎంటీ’ (స్టీల్‌ ఎక్స్చేంజ్‌ ఇండియా లిమిటెడ్‌– ఎస్‌ఈఐఎల్‌) స్టీల్‌కు సీఆర్డీఏ ఆమోదముద్ర వేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.  

రాష్ట్ర ప్రభుత్వం భారీ వ్యయంతో అమరావతి రాజధాని నగర నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇంత భారీ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణ సామగ్రి ‘స్టీల్‌’ ప్రాజెక్టు కోసం ఏపీసీఆర్‌డీఏ ‘సింహాద్రి టీఎంటీ’ బ్రాండ్‌కు అధికారికంగా ఆమోదం తెలిపింది. రాజధానిలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఎఫ్‌ఈ550, ఎఫ్‌ఈ500డీ, ఎఫ్‌ఈ550డీ వంటి గ్రేడ్ల స్టీల్‌ను సింహాద్రి టీఎంటీ ద్వారా కొనుగోలు చేయడానికి ఈప్రొక్యూర్‌మెంట్‌(ఈపీసీ) కాంట్రాక్టర్లకు సీఆర్డీఏ అనుమతులు జారీ చేసింది.  

చెప్పేదొకటి చేసేదొకటి 
ఒకవైపు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నిర్వహణ మూలధనం (వర్కింగ్‌ క్యాపిటల్‌) లేక, బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు మూతపడి ప్లాంట్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల జరిగిన ఘోర ప్రమాదం.. ప్లాంట్‌ను మరింత అగాథంలోకి నెట్టేసింది. ఇలాంటి తరుణంలో అమరావతి నిర్మాణానికి అవసరమైన లక్షలాది టన్నుల ఉక్కును ‘వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌’ నుంచే సేకరించేందుకు నిర్ణయం తీసుకుంటే సంస్థకు భారీ ఆర్థిక ఊరట లభించేది.

నిరంతర ఆర్డర్లు, అడ్వాన్స్‌ చెల్లింపుల ద్వారా ప్లాంట్‌లో ఉత్పత్తి పెరిగి ప్లాంట్‌ తిరిగి గాడిన పడే అవకాశం ఉండేది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం కావాలని.. ప్లాంట్‌ తిరిగి కోలుకోకూడదన్న దురుద్దేశంతోనే ప్రైవేట్‌ కంపెనీల వైపు మొగ్గుచూపుతోందని వైజాగ్‌ స్టీల్‌ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక భారీ ముడుపులు చేతులు మారాయన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.  

పునరాలోచనకు డిమాండ్‌ 
సింహాద్రి టీఎంటీ బ్రాండ్‌ ఉత్పత్తులను విక్రయించే ఎస్‌ఈఐఎల్‌.. ఇప్పటికే లాభాల బాటలో నడుస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ రూ. 1,066.42 కోట్ల ఆదాయాన్ని, రూ. 26.99 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆర్థికంగా బలంగా ఉన్న ఇలాంటి సంస్థలకు రాజధాని పనుల కాంట్రాక్టుల ఆమోదం లభించడం ద్వారా ఆ సంస్థ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. 

కానీ, వేలాది మంది కార్మికుల జీవితాలతో ముడిపడి ఉన్న ‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌’కు  రూ.కోట్ల భారీ ప్రాజెక్టు నుంచి తగిన భరోసా దక్కకపోవడం చంద్రబాబు నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఉద్యోగ, కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.  కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి అమరావతి నిర్మాణంలో సింహభాగం ‘విశాఖ ఉక్కు’నే వినియోగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.   

భారీ ముడుపులు చేతులు మారాయన్న అనుమానం 
సొంత ప్లాంట్‌ను కాదని సింహాద్రి టీఎంటీ, జిందాల్‌ వంటి ప్రైవేటు సంస్థల ఉక్కును వాడటం వెనుక భారీ ముడుపులు చేతులు మారాయన్న అనుమానం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉక్కు కర్మాగారాన్ని నాశనం చేసే కుట్రలా కనిపిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు కేవలం విశాఖ ఉక్కును మాత్రమే వినియోగించాలి.  అమరావతిలో స్టీల్‌ ప్లాంట్‌ యార్డు కోసం పది ఎకరాలు కూడా  కేటాయించాలి. – ఎం జగ్గునాయుడు, స్టీల్‌ప్లాంట్‌ అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్‌ 

జగన్‌ దార్శనికత చంద్రబాబులో ఏది? 
నాడు–నేడు, గృహ నిర్మాణాలకు విశాఖ ఉక్కు వినియోగం 
నాడు జగన్‌ ప్రభుత్వ దార్శనికత చంద్రబాబులో మచ్చుకైనా కనబడ్డంలేదని ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తమ హయాంలో చేపట్టిన పలు కీలక ప్రభుత్వ నిర్మాణాలకు విశాఖ ఉక్కును అధికారికంగా వినియోగించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నుంచి కాపాడాలన్న ప్రధాన ఉద్దేశంతో తగిన అన్ని చర్యలూ తీసుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల ద్వారా కొంత ఆర్థిక తోడ్పాటు అందించేందుకు అప్పట్లో పలు కీలక  నిర్ణయాలు తీసుకున్నారు. 

గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు–  పేదలందరికీ ఇళ్లు’ పథకంలో విశాఖ ఉక్కును భారీగా వినియోగించారు. సొంత ఇళ్లు నిర్మించుకునే లబ్దిదారులకు మార్కెట్‌ ధర కంటే తక్కువకే నాణ్యమైన ఇనుమును అందించేందుకు ఏపీ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ నేరుగా వైజాగ్‌ స్టీల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా లక్షలాది టన్నుల స్టీల్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసి గోడౌన్ల ద్వారా లబ్దిదారులకు సరఫరా చేసింది.

అదేవిధంగా.. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన ‘నాడు–నేడు’ మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల్లో కూడా అధిక శాతం విశాఖ ఉక్కును వాడాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా నేరుగా ఆర్‌ఐఎన్‌ఎల్‌ నుంచి కొనుగోళ్లు జరిపారు. ఇలా చిత్తశుద్ధితో ప్లాంట్‌ కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తే.. ప్లాంట్‌ను విచ్ఛిన్నం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement