ఆసియా క్రీడలకు రెజ్లర్లు సుజీత్, అమన్ అర్హత
లక్నో: ఆసియా చాంపియన్ సుజీత్ కల్కాల్... పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లింగ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో వీరిద్దరూ తమ వెయిట్ కేటగిరీల్లో విజేతలుగా నిలిచారు.
సుజీత్ ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో... అమన్ ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. హరియాణాకు చెందిన 23 ఏళ్ల సుజీత్ నాలుగేళ్లు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది సుజీత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. జాగ్రెబ్ (క్రొయేషియా), టిరానా (అల్బేనియా)లలో జరిగిన వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీల్లో... బిష్‌కెక్ (కిర్గిస్తాన్)లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో సుజీత్ స్వర్ణ పతకాలు సాధించాడు. గత ఏడాది ప్రపంచ అండర్–23 చాంపియన్‌షిప్‌లోనూ సుజీత్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
మరోవైపు అమన్‌కు ఈ సీజన్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఆసియా చాంపియన్‌షిప్‌లో 61 కేజీల విభాగంలో పోటీపడ్డ అమన్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. జాగ్రెబ్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ టోరీ్నలోనూ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఆసియా క్రీడలు ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచి–నగోయా నగరాల్లో జరగనున్నాయి.
ఆసియా క్రీడలకు భారత రెజ్లింగ్ జట్లు..
ఫ్రీస్టయిల్ జట్టు: అమన్ సెహ్రావత్ (57 కేజీలు), సుజీత్ కల్కాల్ (65 కేజీలు), సాగర్ జగ్లాన్ (74 కేజీలు), ముకుల్ దహియా (86 కేజీలు), దీపక్ పూనియా (97 కేజీలు), రజత్ రాహుల్ (125 కేజీలు).
గ్రీకో రోమన్ జట్టు: సుమిత్ దలాల్ (60 కేజీలు), దీపక్ (67 కేజీలు), అమన్ (77 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు), నితేశ్ కుమార్ (97 కేజీలు), దీపాన్షు (130 కేజీలు).
మహిళల ఫ్రీస్టయిల్ జట్టు: దీపాన్షి (50 కేజీలు), అంతిమ్ పంఘాల్ (53 కేజీలు), మనీషా భన్వాలా (57 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), మాన్సి అహ్లావత్ (62 కేజీలు), ప్రియా మలిక్ (72 కేజీలు).


