న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం దేశవ్యాప్త కార్యక్రమం ‘క్యా బోల్తీ పబ్లిక్’ను ప్రకటించారు. సెప్టెంబర్ నుంచి పార్టీ దేశమంతా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతుందని, నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను తమ రాజకీయ కార్యాచరణలో ప్రధానంగా నిలుపుతామని చెప్పారు.
రెండు రోజుల పార్టీ చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన దీప్కే.. గత నెల న్యూఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిగిన సీజేపీ ఆధ్వర్యంలోని జెన్ జీ ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచారని, ఆ ఉద్యమం ఫలితంగా అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా మారకుండానే సీజేపీ కొనసాగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా యువత ఆశయాలు, అంచనాలు, ఆందోళనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామని దీప్కే తెలిపారు. “రెండు రోజుల చర్చల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్‌లో దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఆ కార్యక్రమం పేరు ‘క్యా బోల్తీ పబ్లిక్’” అని దిప్కే చెప్పారు.
“ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల ఆశయాలు, అంచనాలు, ఆందోళనలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాం” అని ఆయన తెలిపారు. భారత యువ జనాభాను నిర్లక్ష్యం చేశారని ఆరోపించిన దీప్కే.. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని, అయినా వారి సమస్యలకు ప్రధాన రాజకీయ చర్చల్లో చోటు దక్కలేదని అన్నారు.
“భారత జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. అయినా ఈ ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. ఈ అంశాలపై మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మేము ప్రజల వద్దకు వెళ్తాం. వారి అంచనాలను తెలుసుకుంటాం. వారు ఎదుర్కొంటున్న సమస్యలను వింటాం” అని చెప్పారు.
విద్యా సంస్కరణలపై సీజేపీ పోరాటం
విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా విద్యా సంస్కరణలను సీజేపీ ముందుకు తీసుకెళ్తుందని దీప్కే చెప్పారు. “విద్య ఖర్చు గణనీయంగా పెరిగింది. విద్యార్థులు అధిక ట్యూషన్ ఫీజులను ఎదుర్కొంటున్నారు. కుటుంబాలు భారీ విద్యా వ్యయాన్ని భరించాల్సి వస్తోంది. మన దేశంలో ఉద్యోగాలు దాదాపు లేవు. జంతర్ మంతర్‌కు వచ్చిన వారిలో చాలామంది నిరుద్యోగులే. బలవంతం వల్ల స్విగ్గి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా లేదా డెలివరీ బాయ్‌గా మారాలని ఎవరి కలా, ఆశయమూ ఉండదు” అని చెప్పారు.
డిగ్రీలు సంపాదించినా పెద్ద సంఖ్యలో చదువుకున్న యువత నిరుద్యోగులుగానే ఉన్నారని దిప్కే అన్నారు. “డిగ్రీ సంపాదించిన తర్వాత కూడా దేశ యువతలో దాదాపు 80 శాతం మంది నిరుద్యోగులుగానే ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు. చదువు పూర్తి చేయని వారు లేదా డిగ్రీలు లేని వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. చదువుకున్న యువత భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.
“ఇప్పుడు నిరుద్యోగాన్ని జాతీయ అంశంగా మార్చాలనుకుంటున్నాను. ప్రభుత్వంగా మీరు నిరుద్యోగ సంక్షోభాన్ని ఇక నిర్లక్ష్యం చేయలేరు” అని ఆయన తెలిపారు. పార్టీ సైద్ధాంతిక వైఖరిని మరోసారి స్పష్టం చేసిన దిప్కే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆదర్శాలే సీజేపీకి మార్గదర్శకాలని చెప్పారు.
“మా సిద్ధాంతం భారత రాజ్యాంగ విలువలపై ఆధారపడి ఉంటుంది. మేము లౌకికవాదులం. ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం. మేము ప్రజాస్వామ్యవాదులం. సామాజిక న్యాయం దిశగా పని చేస్తూనే ఉంటాం” అని అన్నారు.
“మహాత్మా గాంధీ శాంతి, అహింస సందేశం, అంబేద్కర్ సామాజిక న్యాయ దృక్పథం, జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక భారత స్వప్నం మాకు స్ఫూర్తిగా నిలుస్తాయి” అని చెప్పారు. ఇటీవలి రాజకీయ మార్పులకు విద్యార్థులే కారణమని దిప్కే పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలకు ముందు దేశం చాలా ఏళ్ల పాటు అణచివేత, నిరంకుశ పాలనను చూసిందని ఆరోపించారు.


