breaking news
shiva puja
-
శ్రావణంలో ఇవి చేస్తే శుభఫలితాలు!
మామూలు సమయాలలో ఎలా ఉన్నా శ్రావణమాసం రాగానే ఇంచుమించు ప్రతి భక్తుడి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెలరోజుల పాటు ఉదయం, సాయంత్రం ధూపదీప నైవేద్యాలతో, చందన సుగంధాలతో, చిరుగంటల సవ్వడితో... కర్పూర నీరాజనపు పరిమళాలతో... కాళ్లకు పసుపు, నొసట కుంకుమ ధరించిన ముత్తైదువల పట్టుచీరల రెపరెపలతో వీధులన్నింటా ఒక పవిత్రమైన వాతావరణం నెలకొంటుంది. అంత గొప్ప శుభమాసం నేడే ప్రారంభమైంది. ఇక ఈ మాసమంతా ఎన్నో పండుగలు, పర్వదినాలు, వివాహాది శుభముహూర్తాలతో సందడి చేయనుంది.సనాతన ధర్మంలో (హిందూ) చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది, ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసంగా శ్రావణమాసానికి పేరు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు విశిష్ట ఫలం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.శివారాధనకు ఎంతో విశిష్టతశ్రావణమాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం.సోమవారాల్లో శివుడి ప్రీత్యర్థం ఈ వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రిపూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఆచరించే ప్రతి పూజకు తగిన ఫలం ఉంటుందని శాస్త్రోక్తి.మంగళ గౌరీ వ్రతంశ్రావణ మాసం లో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అనీ పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీ కృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని ప్రతీతి..వరలక్ష్మీ వ్రతంశ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే ముత్తయిదువులకు వాయనాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి.విశిష్టతలుశుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని ప్రతీతి.శుక్ల పక్ష పౌర్ణమిరాఖీ పౌర్ణమిగా జరుపుకునే శ్రావణ పున్నమి రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ చేస్తారు. వేదాభ్యాసాన్ని ప్రారంభిస్తారు.ఇక ఆ తర్వాత వచ్చే కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య పర్వాలు కూడా శ్రావణమాసంలోనే వస్తాయి. కృష్ణాష్టమి, ΄÷లాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలను ఆచరిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రోక్తి.– పూర్ణిమాస్వాతినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
అత్రీశ్వర మహాత్మ్యం
చిత్రకూట పర్వతానికి సమీపంలో కామదారణ్యం ఉంది. అపారమైన వృక్షసంపదతో, వనచరాలతో, పక్షుల కిలకిలరావాలతో అలరారే కామదారణ్యం పరమ పవిత్రమైన తపోభూమి. తపోధనులకు పెన్నిధిలాంటి కామదారణ్యంలో బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షి తన భార్య అనసూయతో కలసి ఆశ్రమం ఏర్పరచుకుని, తపోనిష్ఠతో ఉండేవాడు.కొంతకాలానికి కామదారణ్యంలో అనావృష్టి ఏర్పడింది. చెట్లు చేమలు ఎండిపోయాయి. మహావృక్షాలు సైతం మోడువారిపోయాయి. అరణ్యంలోని వాపీ కూప తటాకాది జలవనరులన్నీ ఎండిపోయాయి. ఆహారం దొరకక పశు పక్ష్యాదులు అల్లాడిపోయాయి. మోడువారిన వృక్షాలను ఆశ్రయించుకుని ఉన్న పక్షులు ఎండుటాకుల్లా నేలరాలాయి. కనుచూపు మేరలో పచ్చదనం కనిపించని పరిస్థితులు దాపురించాయి. నేల బిరుసెక్కి బీటలువారింది. పచ్చని అరణ్యం ఎండిపోవడంతో పశుపక్ష్యాదులు కళ్ల ముందే నశించిపోతుండటం చూసి, భూతదయ గల అనసూయ అమితంగా కలత చెందింది.‘స్వామీ! అనావృష్టి వల్ల పచ్చని అడవి ఎండిపోయింది. ఆకలి దప్పికలను తీర్చుకోలేక వన్యప్రాణులన్నీ కళ్లముందే నశిస్తున్నాయి. ఈ ప్రాణి వినాశనాన్ని చూడలేకున్నాను. ప్రాణులను రక్షించడానికి వర్షాగమనం కోసం వరుణదేవుడిని ప్రార్థించండి’ అని భర్తను కోరింది.అనావృష్టి కారణంగా జరుగుతున్న ప్రాణినష్టానికి అత్రి మహర్షి కూడా ఆవేదన చెంది, గంగాధరుడైన పరమశివుడిని ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించాడు. రోజుల తరబడి ఆయన తపస్సు కొనసాగుతున్నా, కామదారణ్యంలో చినుకు జాడ లేదు. అనసూయ తపోనిష్ఠలో ఉన్న భర్తను సేవించుకుంటూనే, ఆశ్రమంలో మట్టితో ఒక పార్థివ శివలింగాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజించసాగింది. అనసూయ నియమనిష్ఠలకు, అత్రి మహర్షి తపస్సుకు పరవశుడైన పరమశివుడు గంగా పార్వతీ సమేతంగా కామ్యదారణ్యానికి అరుదెంచాడు. తగిన తరుణం కోసం అక్కడే వేచి ఉండసాగాడు.ఒకనాడు అత్రిమహర్షి ధ్యానసమాధి నుంచి బయటకు వచ్చాడు.‘దాహంగా ఉంది. మంచినీళ్లు తీసుకురా’ అని భార్యను కోరాడు.ఆ సమయానికి ఆశ్రమంలో చుక్కనీరైనా లేకపోవడంతో అనసూయ కలశాన్ని తీసుకుని, అడవిలోకి వెళ్లింది. ఎక్కడైనా నీటిజాడ కనిపిస్తుందేమోనని వెదుకుతూ ముందుకు సాగింది. ఎంత దూరం వెళ్లినా ఆమెకు ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. అనసూయ నీటి కోసం వెదుకుతూ అలా ముందుకు వెళుతుండగా, ఒకచోట గంగాదేవి ఒక గిరిజన వనిత రూపంలో కనిపించింది. ‘ఎవరమ్మా నువ్వు! ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?’ అని ఆమె అనసూయను ప్రశ్నించింది.‘చిరకాలం తపస్సమాధిలో ఉన్న నా భర్త ఇందాకే తపో విరమణ చేశాడు. ఆయన దాహార్తితో నీళ్లు తెమ్మన్నాడు. అందుకే నీటి కోసం వెదుకుతున్నాను. దగ్గరలో నీరు దొరికే చోటు నీకేమైనా తెలిస్తే చెప్పవా?’ అభ్యర్థించింది అనసూయ.‘ఇక్కడే నువ్వు నిలుచున్న తావునే చేయిలోతు గోతిని తవ్వు. నీళ్లు దొరుకుతాయి’ అని చెప్పిందామె.అనసూయ ఆమె చెప్పినట్లే అక్కడ గొయ్యి తవ్వింది. చేయిలోతు తవ్వగానే స్వచ్ఛమైన నీరు ఉబికి వచ్చింది. ఆ నీటితో అనసూయ కలశాన్ని నింపుకుంది. చూస్తుండగానే అక్కడ స్వచ్ఛజలంతో నిండిన చక్కని తటాకం ఏర్పడింది. ‘కరుణామయీ! నువ్వు దేవతాస్త్రీలా ఉన్నావు. దయచేసి నేను నా భర్తతో కలసి తిరిగి వచ్చే వరకు ఇక్కడ ఉండవూ! ఇప్పుడే మేమిద్దరం వచ్చి నీ దర్శనం చేసుకుంటాము’ అని అభ్యర్థించింది అనసూయ.ఆమె సరేనని పలికింది.అనసూయ ఆశ్రమానికి చేరుకుని, భర్తకు మంచినీరు ఇచ్చింది. ఆయన తృప్తిగా నీరుతాగి, ‘ఎక్కడా చినుకు జాడ లేకున్నా, ఇంత స్వచ్ఛమైన నీరు ఎక్కడ దొరికింది?’ అని ఆశ్చర్యంగా అడిగాడు.అనసూయ భర్తకు జరిగినదంతా చెప్పింది. వెంటనే ఇద్దరూ కలసి అడవిలో జలతటాకం ఏర్పడిన చోటుకు వెళ్లారు. అప్పటి వరకు గిరిజన వనిత రూపంలో ఉన్న గంగాదేవి వారికి నిజరూపంలో దర్శనమిచ్చింది. ‘ఏ వరం కావాలో కోరుకోండి’ అని ఆ దంపతులను అడిగింది.‘తల్లీ! ఈ తపోవనంలో నువ్వు నిత్యనివాసం ఉండాలి’ అని వారు ప్రార్థించారు.‘మీ దంపతులు ఏడాదికాలం శివార్చన ఫలాన్ని ధారపోస్తే ఇక్కడే శాశ్వతంగా ఉంటాను’ అని పలికింది గంగ.వెంటనే అత్రి మహర్షి, అనసూయ దంపతులు తమ శివార్చన ఫలాన్ని ధారపోశారు. వారి దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీసమేతంగా ప్రత్యక్షమయ్యాడు. ముని దంపతుల కోరికపై అనసూయ అర్చిస్తూ వచ్చిన పార్థివలింగంలోకి తేజోరూపంలో లీనమయ్యాడు. అనసూయ అర్చించిన ఆ శివలింగమే అత్రీశ్వర లింగంగా పురాణ ప్రసిద్ధి పొందింది.∙సాంఖ్యాయన -
మహేంద్రగిరి..శివభక్తుల సిరి
మహేంద్రతనయ– ఒడిశాలోని గజపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాల్లోని లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే జీవనది. మహేంద్రగిరి కొండల్లో పుట్టినందునే ఈ నదికి మహేంద్రతనయ అనే పేరు వచ్చింది. మహేంద్రగిరి కొండలకు మరో విశిష్టత కూడా ఉంది. రోజున ఈ కొండలు అశేష శివభక్తకోటితో కళకళలాడుతూ కనిపిస్తాయి.శివపూజా విధానంలో మూర్తి పూజకంటే లింగార్చనే అనంత ఫలప్రదమని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. మహాభారత కథనం ప్రకారం అరణ్యవాసం చేసినప్పుడు పంచపాండవులు ఇదే విశ్వసించారు. మహేంద్రగిరిపై మహాశివుడిని భక్తి ప్రపత్తులతో కొలిచి తరించారు. తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి శిఖరం 1,501 మీటర్ల ఎత్తులో (4,925 అడుగులు) ఉంటుంది. మహేంద్రగిరి శిఖరాగ్రాన పంచపాండవుల ఆలయాల నిర్మాణం అప్పటి అద్భుత వాస్తునిర్మాణ ప్రతిభకు తార్కాణం. వీటి నిర్మాణం నేటికీ అంతు చిక్కని రహస్యమే! పాండవులు అరణ్యవాస సమయంలో మహేంద్రగిరిపై కొంతకాలం నివసించినప్పుడు శివలింగాలను ప్రతిష్ఠించి, ఆరాధించారని భక్తులు చెబుతారు. ఇక్కడ ప్రస్తుతం కుంతి, ధర్మరాజు, భీముడి ఆలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతావి శిథిలమయ్యాయి. ఈ ఆలయాలన్నింటిలోనూ శివలింగాలే ఉండటం విశేషం. ముప్పయి అడుగుల ఎత్తులో అరుదైన రాతికట్టుతో నిర్మించిన కుంతీ ఆలయం అబ్బురపరుస్తుంది. ఆలయం ఎదురుగా రెండు పురాతనమైన బావులు ఉన్నాయి. అత్యంత ఎత్తయిన మహేంద్రగిరులపై వాటిని ఎలా తవ్వారన్నది అంతుబట్టని విషయం. కుంతీ మందిరం ఉత్తరదిశలో ధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడి ఆలయాలన్నింటిలోకి ఇదే పెద్దది. ధర్మరాజు ఆలయం ఎదురుగా ఉన్న మరో కొండపై భీముడి ఆలయాన్ని కేవలం అయిదు భారీ రాళ్లతో నిర్మించారు. ఈ ఆలయం లోపలికి వెళ్లడానికి చిన్న సందు మాత్రమే ఉంటుంది. మహేంద్రగిరి పర్వతంపై ఉన్న అన్ని ఆలయాలలోనూ ఇదే పురాతనమైనది. పర్వతం చివర ఒక కొండపైన జగన్నాథస్వామి ఆలయం ఉంటుంది. దీన్ని దారుబ్రహ్మ ఆలయంగా పిలుస్తారు. మాఘమాసంలో కనుచూపు మేరంతా మంచుదుప్పటి కప్పుకుని కనిపించే మహేంద్రగిరుల మహోన్నత ప్రకృతి సౌందర్యం చూసి తరించాల్సిందే! ఏటా మహాశివరాత్రి రోజున ఇక్కడి ఆలయాల్లో భారీస్థాయిలో శివార్చన జరుగుతుంది. ఉభయ రాష్ట్రాలకు చెందిన భక్తులు మహాశివరాత్రికి ముందురోజే ఇక్కడకు చేరుకుంటారు. మహాశివరాత్రి రోజంతా పూజ, పురస్కారాలతో జాగరం చేస్తూ ‘జాగరమేళా’ నిర్వహిస్తారు.ఒడిశాలోని కొరాపుట్ జిల్లా దేవమాలి పర్వతం తర్వాత ఆ రాష్ట్రంలో రెండో ఎత్తయిన పర్వతం మహేంద్రగిరి. రామాయణంలో మహేంద్రగిరి కొండను మహేంద్రపర్వతంగా పేర్కొన్నారు. దాదాపు 1200 వృక్షజాతులకు చెందిన మొక్కలు, చెట్లు ఈ పర్వతంపైన ఉన్నాయని ఒడిశా జీవవైవిధ్య మండలి అధ్యయనంలో తేలింది. దాదాపు మూడువందలకు పైగా ఔషధ మొక్కలు ఇక్కడ లభిస్తాయి.మహా శివరాత్రి యాత్రకు ఆర్టీసీ అధికారులు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు. మందస సమీపంలోని సాబకోట, సింగుపురం గ్రామాల వద్ద నడకయాత్ర భక్తుల కోసం వివిధ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేస్తాయి. సుమారు 32 కిలోమీటర్లు కొండలు, వాగులను దాటి కాలిబాటన మహేంద్రగిరులను చేరుకోవాలి. శ్రీకాకుళం నుంచి ఒడిశాలోని పర్లాకిమిడి, కొయిపూర్ మీదుగా కూడా మహేంద్రగిరులను చేరుకోవచ్చు. పర్లాకిమిడి నుంచి 66 కిలోమీటర్లు ప్రయాణించి మహేంద్రగిరిని చేరుకోవచ్చు. శివరాత్రి రోజు తప్ప ఏడాదంతా మానవ సంచారం కానరాని ఈ మార్మిక మహేంద్రగిరి సందర్శన ఆద్యంతం అద్భుతం. బాలు అయ్యగారి -
నేను చేస్తున్న పూజల కారణంగానే...
విశాఖపట్నం: తాను చేస్తున్న శివపూజల కారణంగానే హుద్-హుద్ తుపానులో ప్రాణనష్టం తప్పిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు. విశాఖ నగరంలోని ఆనందపురంలో ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవన్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విశాఖ నగరాన్ని చిగురుటాకులా వణికించిన హుద్-హుద్ తుపానులో ప్రాణనష్టం జరగకపోవడానికి తాను చేస్తున్న ఈశ్వర పూజలే కారణమని వ్యాఖ్యానించారు. సుబ్బిరామిరెడ్డి శివభక్తుడన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈశ్వరుడిని ఆయన నిత్యం పూజిస్తూ ఉంటారు. ప్రత్యేక యాగాలు, హోమాలు నిర్వహిస్తుంటారు.


