చర్లపల్లి జైలులో ‘నివృత్తి’ మత్తు విముక్తి కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా
జైళ్లలో పరిస్థితుల మెరుగుదలకు ఎన్నో చర్యలు చేపట్టానని వెల్లడి
మత్తు పదార్థాల దుర్వినియోగం తీవ్రమైన సామాజిక, ప్రజారోగ్య సమస్యగా నిలుస్తోందని ఆందోళన
కారాగార వ్యవస్థ బలోపేతానికి తన మద్దతు కొనసాగుతుందని భరోసా
కుషాయిగూడ (హైదరాబాద్): మత్తు పదార్థాల దుర్వినియోగం తీవ్రమైన సామాజిక, ప్రజా ఆరోగ్య సమస్యగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. తన రాజకీయ జీవితంలో అనేకసార్లు జైళ్లను సందర్శించిన అనుభవం ఉందని ఖైదీలు, జైలు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. గతంలో యూపీలో జైళ్ల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో జైళ్లలో పరిస్థితుల మెరుగుదలకు, సి బ్బంది సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
పోలీసు కానిస్టేబుళ్లకు, జైలు వార్డర్లకు సమాన వేతనాలు కల్పించేందుకు కృషి చేసినట్లు చెప్పారు. ఖైదీలకు మానవీయ వాతావరణం కల్పించేందుకు జైళ్లలో ఫ్యాన్లు, టీవీ వంటి సౌకర్యాలు ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. భవిష్యత్‌లో కూడా సంస్కరణాత్మక కారాగార వ్యవస్థను బలోపతం చేయడంలో తన మద్దతు కొనసాగుతుందని స్పష్టంచేశారు. సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో ‘నివృత్తి’మత్తు విముక్తి కేంద్రాన్ని శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు విముక్తి కేంద్రాల వంటి కార్యక్రమాలు నషా ముక్త్ భారత్ అభియాన్ వంటి జాతీయ పథకాల లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. తెలంగాణ కారాగార శాఖ సంస్కరణాత్మక, మానవీయ దృక్పథంతో ముందుకు సాగుతుండటం అభినందనీయమని చెప్పారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఏరియా 77 నేచర్ క్యాంప్, అడ్వెంచర్ పార్క్ ప్రాజెక్టు ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలు, విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు.
వినోదాత్మక, శిక్షణాత్మక కార్యకలాపాల ద్వారా పునరావాసానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని పేర్కొన్నారు. జీవనోపాధి కార్యక్రమాల ద్వారా ఖైదీల్లో నైపుణ్యాభివృద్ధి మెరుగుపరచడంతోపాటు బాధ్యతాభావాన్ని పెంపొందించవచ్చని చెప్పారు.
కీలక మైలురాయిగా నివృత్తి: డీజీ సౌమ్యా మిశ్రా
చర్లపల్లి జైల్లో ‘నివృత్తి’మత్తు విముక్తి కేంద్రం జైలు సంస్కరణల దిశగా ఓ కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా మిశ్రా అన్నారు. ఈ కేంద్రాలు చంచల్‌గూడ, చర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్ సెంట్రల్ జైలుతోపాటు హైదరాబాద్ మహిళా ప్రత్యేక జైలులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఖైదీలు గౌరవప్రదంగా తమ జీవితాలను పునర్‌నిర్మించుకునే అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, వికలాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


