హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు అపోలో ఆసుపత్రులు, పర్పుల్ రైడ్ సంయుక్తంగా ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించాయి. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అపోలో ఆసుపత్రి వరకు కొనసాగింది. సుమారు వెయ్యికి పైగా మహిళలు పాల్గొని ఉత్సాహంగా ర్యాలీని విజయవంతం చేశారు. న్యాయం, గౌరవానికి ప్రతీకగా భావించే పర్పుల్ రంగు సందేశాలతో తెలుపు టీషర్టులు ధరించి మహిళలు పాల్గొన్నారు.
ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో అపోలో ఆసుపత్రుల జాయింట్ మేనే జింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగితా రెడ్డి మాట్లాడుతూ, మహిళలు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ముందుగా చూసుకుంటూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఎక్కువగా ఉందన్నారు. గుండె జబ్బులు, స్తన మరియు గర్భాశయ గర్భద్వార క్యాన్సర్లు, మధుమేహం, రక్తహీనత వంటి వ్యాధుల కోసం క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని చెప్పారు. ముందస్తు పరీక్షల ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని, ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆరోగ్య రంగంలో సాంకేతికత ప్రాధాన్యాన్ని వివరించిన ఆమె, ఏఐ ఆధారిత ఆరోగ్య అంచనాలు ద్వారా వ్యాధి ప్రమాదాలను ముందుగానే గుర్తించి సమయానికి వైద్య సలహాలు పొందవచ్చన్నారు. మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలని సూచించారు.
ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రుల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సీఈఓ తేజస్వి రావు వీరేపల్లి మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళలు సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని, మహిళలు బైక్ నడపలేరనే భావన ఇప్పుడు పాతబడి పోయిందన్నారు. ఈ ర్యాలీ ద్వారా మహిళల సాధికారతతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం లక్ష్యమని చెప్పారు.
క్యాంపెయిన్‌కు అనుబంధంగా ఉన్న డాక్టర్ రోషన్ మాట్లాడుతూ, మహిళలు ఆరోగ్య పరీక్షలు, వ్యాయామం, ముందస్తు స్క్రీనింగ్‌పై దృష్టి పెట్టడం ద్వారా జీవనశైలి వ్యాధులను నివారించవచ్చన్నారు. మహిళల ధైర్యం, సామర్థ్యాన్ని ఈ ర్యాలీ ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అపోలో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్న వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. సాధారణ ఆరోగ్య సమస్యలు, జీవనశైలి వ్యాధులు, ముందస్తు నిర్ధారణ ప్రాధాన్యం గురించి వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉచిత వైద్య సలహాలు, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్వచ్ఛంద సేవకులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


