‘ఖద్దర్‌ నాక్‌’! | - | Sakshi
Sakshi News home page

‘ఖద్దర్‌ నాక్‌’!

Mar 7 2026 7:28 AM | Updated on Mar 8 2026 10:04 AM

పోలీసు గల్లా పడతాం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో పోలీసులు, రాజకీయ పార్టీ నేతల మధ్య వైరం ముదురుతోంది. కొందరు స్థానిక ఎస్సై, సీఐలను ఇబ్బంది పెడుతుంటే.. మరికొందరు ఏకంగా సీపీని బహిరంగంగా దూషించి, విమర్శించిన సందర్భాలు మరిచిపోకముందే.. మరో ఘటన వెలుగుచూసింది. ఇంతకాలం పోలీసుల విషయంలో మాటల దాడులు, ఆరోపణల వరకే పరిమితమైన నాయకులు తాజాగా డ్యూటీలో ఉన్న ఎస్సై కాలర్‌ పట్టుకుని, తోసేసి, దాడిచేసిన ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఘటనపై రాజకీయ ఒత్తిళ్లతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఘటనపై పోలీసు యంత్రాంగం తీవ్రంగా మండిపడుతుంది. ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది.

ఏం జరిగిందంటే?
కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఓ సర్కిల్‌లో జాతర సాగుతోంది. అక్కడ అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. కలిసి వేడుకలు నిర్వహించాల్సిన నేతలు విడిపోయి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తమ ఊరి జాతర ప్రత్యేకతను తెలిపేందుకు బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ నేత డ్రోన్‌తో వీడియో తీయించారు. దీనిపై గ్రామంలో అధికార పార్టీ నాయకులు అనుమతి లేకుండా తమ గ్రామంలో డ్రోన్‌ ఎగురవేశాడని, మహిళలు ఇబ్బంది పడ్డారని పోలీసులకు గ్రామస్తుడితో ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. డ్రోన్‌ ఎగరకుండా నిలిపివేయిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

 ఎస్సై కాలర్‌ పట్టుకున్న నేత..
ఇదే క్రమంలో పోలీసులు గ్రామానికి చేరుకుని గొడవ సద్దుమణిగేలా ఇరు పక్షాల నేతలతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన ఓ అధికార పార్టీ నేత ఏకంగా ఎస్సై కాలర్‌ పట్టుకున్నాడు. ఆయన్ను చేతులతో దాడి చేసి తోసివేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సదరు నేతను అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతోపాటు స్థానికులు తమ ఫోన్లలోనూ వీడియో తీశారు. మరోవైపు పోలీసులు కూడా దీనిపై సీపీకి సమాచారం అందించారు.

రంగంలోకి కీలక నేత.. ఆగిన కేసు..
ఎస్సై కాలర్‌ పట్టుకున్న విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే చర్యలకు సిద్ధమయ్యారు. అయితే అధికార పార్టీకే చెందిన ఓ కీలక నేత రంగంలోకి దిగారు. తమ అనుచరులపై కేసు నమోదు చేయవద్దని వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని సమాచారం. దీంతో దాడిచేసిన నేతపై చర్యలు తీసుకోకుండా పోలీసులు మిన్నకుండిపోయారని తెలుస్తోంది. విధుల్లో ఉన్న ఎస్సై కాలర్‌ పట్టుకున్నా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. అధికార, విపక్షాలు అన్న తేడా లేకుండా.. నేతలంతా కలిసి తమ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న తీరుపై పోలీసులు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలను ఎప్పటికపుడు ఎండగట్టకపోతే జిల్లాలో విధులు నిర్వహించడం రానురాను ఇబ్బందికరంగా మారుతుందని వాపోతున్నారు. ఈ విషయంపై సీపీ గౌస్‌ ఆలంను సాక్షి వివరణ కోరగా.. ఎస్సై కాలర్‌ పట్టుకున్న విష యం తమ దృష్టికి ఇంకా రాలేదని, ఘటనపై లోతుగా ఆరా తీస్తామని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం సీపీ కార్యాలయం ఘటనపై వివరాలు సేకరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement