స్పేస్‌ఎక్స్ ఐపీఓ విజయవంతం కావడంతో ఎలాన్ మస్క్ తొలి ట్రిలియనీర్ అయ్యారు. కానీ.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఆయన, డబ్బు చివరికి పూర్తిగా నిరుపయోగంగా మారుతుందని సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారితీశాయి.
ఇటీవల ఎక్స్‌ప్రైజ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ 'పీటర్ డయామాండిస్'తో మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోబోట్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మారుస్తాయని మస్క్ పేర్కొన్నారు. ఏఐ, రోబోట్లు నిరంతరం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయగలవు. తద్వారా వస్తువుల ధరలు కూడా తగ్గిపోతాయి. చివరికి మనుషులు చేయడానికి పనులు లేకుండా పోతాయని అన్నారు.
మనుషుల అవసరం ఎప్పుడైతే తగ్గిపోతుందో.. ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. కార్మికుల అవసరం ఉండదు, వారికి వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఒక దశలో డబ్బు అవసరం ఉండదని మస్క్ స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన్ మీరు, డబ్బు అవసరం ఉండదని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉందని మస్క్‌ను ఇంటర్వ్యూ చేసే పీటర్ డయామాండిస్ అన్నారు. భవిష్యత్తులో ఇది నిజం అవుతుందని టెస్లా బాస్ జవాబిచ్చారు.
భవిష్యత్తులో ప్రజలు ఉద్యోగాల ద్వారా సంపాదించకపోయినా.. జీవించగలిగేలా 'యూనివర్సల్ హై ఇన్‌కమ్' (సార్వత్రిక ఆదాయం) అనే వ్యవస్థ వస్తుందని మస్క్ గతంలో సూచించారు. ఈ విధానంలో ప్రతి ఒక్కరికీ కనీస జీవనానికి సరిపడే ఆదాయం లభిస్తుంది. అవసరమైనవారికి ప్రభుత్వాలే డబ్బులు ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. తద్వారా ఆటోమేషన్ వల్ల వచ్చే మార్పులను సమాజం ఎదుర్కోగలుగుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్!


