భారత మహిళల చేతుల్లో కొత్త ఆర్థిక శక్తి
పోపుల పెట్టె పొదుపు నుంచి పోర్ట్‌ఫోలియోవైపు దూకుడు
మహిళల మ్యూచువల్ ఫండ్ ఆస్తులు రూ.11.3 లక్షల కోట్లు
35 ఏళ్లలోపే పెట్టుబడులు ప్రారంభిస్తున్న 80శాతం మహిళలు
సంపద సృష్టికోసం ఈక్విటీ,మ్యూచువల్ ఫండ్స్‌కి ప్రాధాన్యత
వెల్త్ క్రియేటర్లుగా మారుతున్న మహిళా శక్తి
ఒకప్పుడు భారతీయ మహిళల ఆర్థిక ప్రపంచం.. బంగారు నగలు,పోస్టాఫీస్ సేవింగ్స్, చిట్‌ఫండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వరకే పరిమితమై ఉండేది. కుటుంబ భవిష్యత్తు కోసం భాగస్వామితో కలిసి అంతో ఇంతో పొదుపు చేసేవారు, సంపద పెంచాలి, పెంచుకోవాలి అనే తపన తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా దృశ్యం పూర్తిగా మారుతోంది. భర్త సంపాదించి ఇచ్చినా, తాను స్వయంగా కష్టపడి సంపాదించినా వచ్చే ప్రతి రూపాయిలో రిటైర్మెంట్ కలలు, విదేశీ యాత్రల లక్ష్యాలు, ఆర్థిక స్వాతంత్య్రఆశయాలు కూడా చేరుతున్నాయి. భారత మహిళలు సేవింగ్స్ నుంచి ఇన్వెస్టింగ్‌కి మారడం లేదు... సేవింగ్స్‌కే కొత్త అర్థం చెబుతున్నారు. – సాక్షి, వెల్త్ డెస్క్
అమ్మమ్మ తరం బంగారం దాచింది. అమ్మ తరం ఫిక్స్‌డ్ డిపాజిట్లు వేసింది.ఇప్పుడు కూతురు తరం షేర్లు, ఈక్విటీలు, సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్)లలో పెట్టుబడులు పెడుతోంది. మూడు తరాలు... మూడు ఆర్థిక తత్వాలు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే ... భవిష్యత్తు భద్రత. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే కొత్త తరం మహిళలు డబ్బును కేవలం దాచడం కాదు... దాచిన దానితో తిరిగి డబ్బు సంపాదించడం కూడా నేర్చుకుంటున్నారు. అందుకే భారత మహిళల చేతుల్లో ఇప్పుడు కేవలం నగల పెట్టెలు కాదు, మొబైల్ ఫోన్లలో మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలు కూడా కనిపిస్తున్నాయి. మహిళలు కేవలం పొదుపుదారులుగానే కాకుండా, సమర్థవంతమైన ఇన్వెస్టర్లుగా ఎదుగుతున్నారు. సంప్రదాయ బంగారంతో పాటు మ్యూచువల్ ఫండ్లు,సిప్‌లు, ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు, రిటైర్మెంట్ కార్పస్ నిర్మాణం దిశగా దూసుకెళ్తున్నారు.ఈ మార్పు కేవలం వ్యక్తిగత పెట్టుబడి ధోరణి కాదు. భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని తిరిగి నిర్వచిస్తున్న నిశ్శబ్ద విప్లవం.
సంఖ్యల్లో మహిళల ఆర్థిక దూకుడు
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వెలువరించిన గణాంకాలు మహిళల భాగస్వామ్యం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టంగా చూపిస్తున్నాయి.
🔸 దేశీ పెట్టుబడుల్లో మహిళా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల వాటా 25 శాతం దాటింది.
🔸 వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ ఏయూఎంలో వాటా 33 శాతం పైగా ఉంది.
🔸 మహిళల నిర్వహణలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు రూ.11.3 లక్షల కోట్లు
🔸 మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఇన్‌ఫ్లోలలో వాటా 35 శాతం
🔸 35 ఏళ్లలోపు పెట్టుబడులు ప్రారంభించిన మహిళలు 80శాతం ఈ గణాంకాలు ఒక కీలక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.నేటి తరం మహిళలు ఇప్పుడు కేవలం డబ్బు దాచడం కాదు... డబ్బుతో పని చేయించడం నేర్చుకుంటున్నారు.
బంగారం నుంచి సిప్ లకు కాదు... బంగారంతో పాటు సిప్‌లకు
మహిళలు బంగారాన్ని కొనడం పూర్తిగా మానేశారా అంటే లేదనే చెప్పాలి. వాస్తవానికి వారు సంప్రదాయ పెట్టుబడులను ఆధునిక ఆరి్ధక సాధనాలతో కలిపి సరికొత్త సమతుల్య పోర్ట్‌ఫోలియోలను నిర్మిస్తున్నారు. బంగారం అంతో ఇంతో తరచూ కొనడం ఇప్పటికీ వారికి కుటుంబ సంప్రదాయమే. ఆనందం కలిగించే విషయమే. బంగారం అత్యవసర సమయాల్లో లిక్విడిటీ అందిస్తుంది. పిల్లల ఉన్నత చదువులు, వివాహ అవసరాలకు, అనారోగ్య పరమైన ఖర్చుల విషయంలో భద్రతనిస్తుంది. అయితే దీర్ఘకాలిక సంపద పెరగాలంటే కాంపౌండింగ్ శక్తి అవసరమని కొత్త తరం మహిళలు గ్రహిస్తున్నారు. అందుకే ప్రతి నెలా సిప్‌ల రూపంలో క్రమశిక్షణతో పెట్టుబడులు పెడుతున్నారు.
నేటి మహిళల కొత్త పెట్టుబడి సూత్రం..
భద్రతకు బంగారం... సంపదకు సిప్ అనే మార్పునకు మూడు కారణాలున్నాయి.
🔸 పెరిగిన ఆదాయాలు. కుటుంబంలో పెరుగుతున్న నిర్ణయాధికారం.
ఐటీ, బ్యాంకింగ్, ఆతిథ్యం, ఆరోగ్యరంగం, కార్పొరేట్ సేవలు, స్టార్టప్‌లు, ఫ్రీలాన్సింగ్ రంగాల్లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో కుటుంబ ఆదాయం పెరుగుతోంది. మహిళలు కూడా కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు తండ్రి లేదా భర్త తీసుకునే పెట్టుబడి నిర్ణయాలను ఇప్పుడు మహిళలే చొరవచూపి స్వయంగా తీసుకుంటున్నారు.
🔸 డిజిటల్ విప్లవం
షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలంటే ఒకప్పుడు బ్రోకర్లు,బ్యాంక్ శాఖల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అనేక దరఖాస్తు ఫారాలు నింపాల్సి ఉండేది.నేడు స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్యాంకుఖాతా, ఆధార్, పాన్ కార్డు ఉంటే చాలు స్మార్ట్ ఫోన్ ద్వారా డీమ్యాట్ అకౌంట్లు తెరిచే అవకాశం పెరిగింది. కేవలం పది నిమిషాల్లో సిప్ ఖాతాలు ప్రారంభించగలుగుతున్నారు. ఈ సాంకేతిక విప్లవమే లక్షలాది మహిళలను ఆర్థిక మార్కెట్లకు దగ్గర చేసింది.
🔸 లక్ష్యాల కోసం పెట్టుబడులు
గత తరాలు పిల్లల చదువు,పెళ్లిళ్ల అవసరాల కోసం మాత్రమే పొదుపు గురించి ఆలోచించేవి. కానీ నేటి ఆధునిక తరం మహిళలు మాత్రం వ్యక్తిగత రిటైర్మెంట్, విదేశీ విహార యాత్రలు, సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు, ఎమెర్జన్సీ అవసరాలకు ఇలా అనేక ప్రత్యేక లక్ష్యాలతో పెట్టుబడుల వైపు
దూసుకెళుతున్నారు.
మెరుగైన ఇన్వెస్టర్లుగా మహిళలు?
గణాంకాలను పరిశీలిస్తే పెట్టుబడుల ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన వాస్తవం వెలుగులోకి వస్తోంది. పురుషుల్లాగా మహిళలు వెంటవెంటనే కొనుగోలుఅమ్మకాలు జరపడంలేదు. ఏదో కారణంతో తరచూ పడిపోయే స్టాక్ మార్కెట్‌లో భయపడి పెట్టుబడులు ఉపసంహరించుకోవడంలేదు. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో
కొనసాగుతున్నారు.
మహిళా ఇన్వెస్టర్ల ప్రత్యేకత
🔸 సిప్‌లను నిరంతరంగా కొనసాగించడం
🔸 దీర్ఘకాలిక దృష్టి
🔸 తక్కువ రిస్‌్కతో సమతుల్య పెట్టుబడులు
🔸 భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండటం
🔸 లక్ష్యంతో పెట్టుబడి ప్రణాళికలు వేయడం
ఈ కారణాల వల్ల మహిళల పోర్ట్‌ఫోలియోలు దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.
చిన్న పట్టణాల్లోనూ పెద్ద మార్పు
మహిళల పెట్టుబడుల విప్లవం కేవలం దేశంలోని మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి టైర్2 (ద్వితీయ శ్రేణి) , టైర్3 తృతీయ శ్రేణి నగరాల్లో కూడా మహిళలు భారీగా సిప్ పెట్టుబడులు ప్రారంభిస్తున్నారు.ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచి్చన ఫైనాన్షియల్ కంటెంట్, యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ ఫిన్‌టెక్ యాప్‌లు కూడా ఈ పెట్టుబడి విప్లవానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
ఆర్థిక స్వాతంత్య్రం అంటే జీతం కాదు... ఆస్తులు
ఆర్థిక స్వాతంత్య్రమంటే జీతం సంపాదించడం మాత్రమే కాదు.దాన్ని సంపదగా మార్చడమని నేటి మహిళలు కొత్త నిర్వచనం చెబుతున్నారు. ఆమె దృష్టిలో నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే
🔸 తన పేరుమీద ఆస్తులు ఉండటం ళీ ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం
🔸 తన రిటైర్మెంట్ కోసం ప్రత్యేక కార్పస్ నిర్మించుకోవడం
🔸 జీవితంలోని అనిశ్చిత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడం
🔸 ప్రతి మహిళ పర్సనల్ ఫైనాన్స్ చెక్‌లిస్ట్ తయారుచేసుకోవాలి
తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి
🔸 నా పేరుమీద పెట్టుబడులు ఉన్నాయా?
🔸 బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మించి ఈక్విటీ లు, మ్యూచువల్ ఫండ్సులో ఇన్వెస్ట్‌చేస్తున్నానా?
🔸 రిటైర్మెంట్‌కు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఉందా?
🔸 ప్రతి ఏడాది సిప్ మొత్తాన్ని పెంచుతున్నానా?
🔸 ఏదైనా కారణంతో ఒక సంవత్సరం ఆదాయం ఆగిపోతే ఆర్థికంగా నిలబడగలనా?
చివరగా...
భారత మహిళలు బంగారాన్ని వదిలేయడం లేదు. కానీ బంగారం ఒక్కటే భవిష్యత్తు కాదని అర్థం చేసుకుంటున్నారు. భద్రత కోసం బంగారం, స్థిరత్వం కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సంపద సృష్టి కోసం మ్యూచువల్ ఫండ్లు అనే సమతుల్య పెట్టుబడి విధానాన్ని అవలంబిస్తున్నారు. నేటి మహిళల పెట్టుబడి నిర్ణయాలు రేపటి భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేయబోతున్నాయి. కుటుంబ పొదుపులను సంపదగా, సంపదను ఆర్థిక స్వాతంత్య్రంగా మార్చుతున్న ఈ నిశ్శబ్ద విప్లవమే రాబోయే దశాబ్దంలో భారత వృద్ధికి కొత్త ఇంధనంగా మారనుంది. ఇంటి బడ్జెట్‌ను చూసుకునే మహిళ.. ఇప్పుడు దేశ సంపద నిర్మాణంలోనూ కీలక భాగస్వామి అవుతోంది.


