ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు: సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Inaugurated The Arutla Telangana Public School, Highlights Push For Corporate Style Government Education | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు: సీఎం రేవంత్ రెడ్డి

Jun 17 2026 11:52 AM | Updated on Jun 17 2026 12:38 PM

CM Revanth Reddy Inaugurated the Arutla Telangana Public School

ఆరుట్ల:  ప్రభుత్వ విద్యావ్యవస్థను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేలా రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (టీపీఎస్‌) భవనాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా, సుమారు రూ. 15 కోట్ల భారీ వ్యయంతో ఈ విద్యాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆరుట్లకు చేరుకున్న సీఎం, ముందుగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించి పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ వసతులు కల్పించే దిశగా తమ ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యపై తల్లిదండ్రులకు పలు అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం చేపట్టినట్లు సీఎం తెలిపారు. విద్యాశాఖపై తమ ప్రభుత్వం 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని, గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నీరుగార్చిందని ఆరోపించారు. 

ముఖ్యమంత్రి పాఠశాలలోని తరగతి గదులను నిశితంగా పరిశీలిస్తూ క్యాంపస్ అంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా అక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించిన రేవంత్ రెడ్డి, తరువాత వారితో కలిసి కూర్చుని ఎంతో ఉత్సాహంగా అల్పాహారం తీసుకున్నారు. స్కూల్‌లోని అత్యాధునిక వంటగదిని పరిశీలించారు. వంట చేస్తున్న మహిళా సిబ్బందితో కలిసి సరదాగా ముచ్చటిస్తూ, స్వయంగా చపాతీలు (పూరీలు) ఒత్తి వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం అక్కడ ఉన్న వారందరితో కలిసి గ్రూప్ ఫొటోలు దిగారు.

ఈ అంతర్జాతీయ స్థాయి మోడల్ పాఠశాలలో కల్పించిన అద్భుతమైన మౌలిక వసతుల గురించి విద్యా కమిషన్ మాజీ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ముఖ్యమంత్రికి క్షుణ్ణంగా వివరించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ క్యాంపస్‌లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, అధునాతన సైన్స్ ల్యాబ్‌లు, విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయం (లైబ్రరీ), హైటెక్ కిచెన్, విశాలమైన డైనింగ్ హాల్‌తో పాటు ఆటల కోసం పెద్ద క్రీడా మైదానాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఈ  వేడుకలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పలువురు ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement