సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న తీవ్రమైన మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ రాష్ట్రంలోని జిల్లాలకు చెందిన సుమారు 20,000 మంది విద్యార్థులు నేరుగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్ట్‌కార్డులు రాసి తమ నిరసనను, ఆవేదనను వ్యక్తపరిచారు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21A (విద్యా హక్కు) ప్రకారం తమకు న్యాయం చేయాలని ఈ చారిత్రాత్మక ప్రచార ఉద్యమం ద్వారా విద్యార్థులు కోరుతున్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులైన సురక్షితమైన తాగునీరు, బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడం, సైన్స్ లాబొరేటరీలు, లైబ్రరీలు, ఆట స్థలాలు మరియు క్రీడా సాగగ్రి అందుబాటులో లేకపోవడంపై విద్యార్థులు తమ సొంత చేతిరాతతో ఈ లేఖలను రాశారు. అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక క్లాసులు ఖాళీగా ఉంటున్న విషయాన్ని కూడా వారు ఈ ఉత్తరాలలో ప్రస్తావించారు.

కోర్టు ఈ లేఖలను సుమోటోగా స్వీకరించి, ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా (PIL) పరిగణించాలని నిర్వాహకులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
‘నా పేరు శ్రావణి, నేను ఐదవ తరగతి చదువుతున్నాను. శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ హై కోర్ట్ న్యాయమూర్తి గారికి తెలియజేయడమేమనగా మా పాఠశాలలో తరగతి గదులు లేవు, మాకు మంచినీటి సరఫరా లేదు, మాకు కంప్యూటర్లు లేవు. మాకు ఇవన్నీ కల్పించాలి. థాంక్ యు!’
‘నా పేరు వైష్ణవి, నేను పడవ తరగతి చదువుతున్నాను. నేను గువ్వలదిన్నె గ్రామం నుండి నందిన్నె స్కూల్ కి రావడానికి ఇబ్బందికరంగా ఉంది. ఉదయం 4 కిలోమీటర్లు, సాయంత్రం 4 కిలో మీటర్లు కాలి నడకతో వస్తున్నాం. బస్సు సౌకర్యం లేనందున కొంతమంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు. అందుకోసం మాకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం.’

ఈ పోస్ట్‌కార్డుల ద్వారా గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాల విద్యార్థుల వాస్తవ పరిస్థితులు అత్యున్నత న్యాయస్థానానికి నేరుగా చేరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం,(TSCPCR), విద్యాశాఖ వెంటనే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని నిర్వాహక బృందం డిమాండ్ చేస్తోంది.


